రియల్‌ హీరో సోనూ సూద్‌ వివాదంలో ఇరుక్కున్నారు. ఇంటి స్థలం విషయంలో ఆయనపై పోలీస్‌ స్టేషన్‌ కేసు నమోదైంది. తన నివాస స్థలాన్ని హోటల్‌గా మార్చడం ఇప్పుడు వివాదానికి కారణమైంది.  ముంబయిలోని జుహు ప్రాంతంలో శక్తి సాగర్‌ అనే పేరుతో సోనూ సూద్‌కి ఆరంతస్థలు భవనం ఉంది. అధికారుల అనుమతి తీసుకోకుండా దీన్ని హోటల్‌గా మార్చారంటూ బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బిఎంసి) అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భవనానికి నోటీసులు పంపించారు. వాటిని పట్టించుకోకుండా హోటల్‌ని రన్‌ చేయడాన్ని మున్సిపల్‌ అధికారులు తప్పుపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేవారు. 

నిబంధనలకు విరుద్ధంగా తాను వ్యవహరించారన్న ఆరోపణలను సోనూ సూద్‌ ఖండించారు. తన వద్ద ఆ హోటల్‌ స్థలానికి సంబంధించి అన్ని అనుమతులున్నాయని తెలిపారు. కేవలం మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎంసీజెడ్‌ఎంఏ) నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందన్నారు. అది కరోనా వల్ల ఆలస్యమయ్యిందని పేర్కొన్నారు. ఒకవేళ దానికి పర్మిషన్‌ రాకపోతే తిరిగి నివాస స్థలంగా మారుస్తానని చెప్పారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ప్రాథమిక విచారణ చేపట్టాకే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని చెప్పారు.