గత ఏడాది బాలీవుడ్ లో మీటూ ఉద్యమం పెను సంచలనం సృష్టించింది. ఆ క్రెడిట్ మొత్తం తనుశ్రీ దత్తాకే చెందుతుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ పై తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చాలామంది నటులు, నటీమణులు, దర్శకులు తనుశ్రీకి మద్దత్తు తెలపడం ప్రారంభించారు. దీనితో బాలీవుడ్ లో మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

2008లో హార్న్ ఓకే ప్లీజ్ మూవీ షూటింగ్ లో నానా పటేకర్ తనని లైంగిక వేధింపులకు గురిచేశాడని తనుశ్రీ ఆరోపించింది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నానా పటేకర్ పై తనుశ్రీ కేసు కూడా నమోదు చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టనిదెబ్బ తెస్తోందటూ నానా పటేకర్ కూడా తనుశ్రీపై కేసుపెట్టాడు. 

తనుశ్రీ ఆరోపణల కారణంగా నానా పటేకర్ సినిమా అవకాశాలు కూడా కోల్పోయారు. మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద రచ్చగా మారడంతో పోలీసులు నానా పటేకర్ కేసుపై విచారణ ప్రారంభించారు. కానీ  ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ కేసు విషయంలో తనుశ్రీకి తాజాగా పెద్ద షాక్ తగిలింది. నానా పటేకర్ పై చేసిన ఆరోపణలు రుజువు కాలేదని, ఎలాంటి ఆధారాలు లభించలేదని కేసుని క్లోజ్ చేశారు. 

తాము మాత్రం ఈ కేసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, కోర్టుని ఆశ్రయిస్తామని తనుశ్రీ తరుపున న్యాయవాది ప్రకటించారు. తనుశ్రీ మొదలు పెట్టిన మీటూ ఉద్యమం తర్వాత సీనియర్ హీరో అర్జున్ సార్జా, అలోక్ నాథ్, వికాస్ బహల్ లాంటి సినీ ప్రముఖులపై పలువురు నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.