సూపర్ స్టార్ కృష్ణ మృతిపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం  తెలిపారు. ఆయన మరణం సినీ, వినోద రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

సూపర్ స్టార్ కృష్ణ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆయన మరణం సినీ, వినోద రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘కృష్ణ గారు తన బహుముఖ నటన, వ్యక్తిత్వం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్. ఆయన మృతి సినీ, వినోద రంగానికి తీరని లోటు. ఈ విచారకరమైన సమయంలో నా ఆలోచనలు మహేష్‌బాబుతో పాటు మొత్తం కుటుంబ సభ్యులతో ఉన్నాయి. ఓం శాంతి’’ అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

సూపర్ స్టార్‌ కృష్ణ మృతిపై పలువురు బీజేపీ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి మృతి సినీ రంగానికి తీరనిలోటు వారి 
కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ..అల్లూరి లాంటి పాత్ర ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో వారి స్థానం సుస్థిరం. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నాను’’అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…


‘‘ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు గారితో నిన్నటి రోజున ఫోన్లో మాట్లాడడం జరిగింది.ఇంతలోపే కృష్ణ గారు మరణించారన్న విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతి చెందాను. అనేక తెలుగు చిత్రాలలో సమాజాన్ని తట్టి లేపే విధంగా, ప్రజలను చైతన్యం చేసే ఎన్నో చిత్రాలలో కృష్ణ గారు నటించి జీవించారు.తన నటన ద్వారా అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలియజేసారు.ఏ పాత్ర పోషించిన ఆ వర్గం తమ నాయకుడిగా, తమ మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న విషిష్టమైన నటుడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, ప్రజలు గొప్ప సినీ నటుడిని కోల్పోయింది. వారి మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు.సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు,అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ట్వీట్ చేశారు. 

సూపర్ స్టార్ కృష్ణ మృతిపై తెలుగు నిర్మాతల మండలి సంతాపం తెలిపింది. కృష్ణ మృతికి సంతాపంగా ఎల్లుండి సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించింది. ఇక, కాసేపటి క్రితం కృష్ణ భౌతికకాయాన్ని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్‌రామ్ గూడలోని నివాసానికి తరలించారు. ప్రముఖల సందర్శన కోసం కొన్ని గంటల పాటే కృష్ణ భౌతికకాయాన్ని ఇంటివద్దే ఉంచనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మధ్యాహ్నం సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఇంట్లో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం.. అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం తరలించనున్నారు.