ఎంసీఏ పై భారీ పైరసీ స్కామ్ స్కెచ్.. దిల్ రాజుకు బెదిరింపులు

First Published 21, Dec 2017, 2:14 AM IST
PIRACY GANG THREATENING CALLS TO PRODUCER DIL RAJU
Highlights
  • వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు
  • తాజాగా విడుదలయిన నాని, సాయిపల్లవిలు నటిస్తోన్న ఎంసిఎ చిత్రం
  • ఈ చిత్రం పైరసీపై దిల్ రాజుకు బెదదిరింపులు
  • అజ్ఞాతవాసి చిత్ర నిర్మాత రాథాకృష్ణకు కూడా బెదిరింపులు

తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ చీడను వదిలించడంలో ఎప్పటికప్పుడు నిందితులు కొత్త పుంతలు తొక్కుతూ.. పోలీసులకు, ఫిల్మ్ మేకర్స్ కు కొరకరాని కొయ్యలుగా మారుతూనే వున్నారు. కోట్లు ఖర్చుపెట్టి రూపొందించిన సినిమాలు పైరసీ కోరల్లో చిక్కుకుని.. విడుదలైన కొద్ది గంటల్లోనే వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవుతుండటంతో నిర్మాతలు లబోదిబో మంటున్నారు.

 

ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా.. భారీ బడ్జెట్ చిత్రాలకు పైరసీ బెడద తప్పట్లేదని ఇటీవలే సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన జవాన్ చిత్ర దర్శకుడు బీవీఎస్ రవి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జవాన్ ఫైనాన్సర్‌ కృష్ణయ్యను బెదిరిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వసూళ్లకు పాల్పడుతున్న పుట్టా సుధాకర్ చౌదరీ, పుట్టా ప్రభాకర్ చౌదరీ, విజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2012 నుంచి వీళ్లు చాలా మంది ఫైనాన్సర్స్ నుంచి డబ్బులు గుంజినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

 

మరోవైపు పైరసీని అరికట్టాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్‌కు ఆయన ఫిర్యాదును అందజేశారు. తాజాగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నాని నటించిన ఎంసీఏ చిత్రం ఇవాళ (డిసెంబర్ 21) విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంసీఏ సినిమా పైరసీని అరికట్టాలని ఆయన డీసీపీని కోరారు. దీనిపై స్పందించిన డీసీపీ.. ఎంసీఏ సినిమా పైరసీకి గురి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాజుకు హామీ ఇచ్చారు.

 

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారు. డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకుముందు జవాన్‌ సినిమా అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని దిల్‌ రాజు చెప్పారు. అలాగే బుధవారం రోజున ప్రముఖ నిర్మాత, అజ్ఞాతవాసి చిత్రాన్ని రూపొందించిన ఎస్.రాధాకృష్ణ కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ చిత్రాన్ని పైరసీకి గురికాకుండా చూడాలని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పైరసీవల్ల ఇటు నిర్మాతలకు, అటు సర్కారు ఆదాయానికి భారీ గండి పడుతోంది.

loader