ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసరమవుతోన్న 'బిగ్ బాస్ 3' రియాలిటీ షో కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. బిగ్ బాస్ షో అశ్లీలత, హింస, అసభ్య ప్రవర్తన ప్రోత్సహించే విధంగా ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

కార్యక్రమాన్ని సెన్సార్ చేయకుండా ప్రసారం చేయడం వలన యూత్, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి కంటెస్టంట్ లను ఎంపిక చేసే ప్రాసెస్ లో జరిగిన వేధింపులపై ఇద్దరు మహిళలు హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేయగా.. షోపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని బిగ్ బాస్ 3 ప్రసారాన్ని నిలువరించేలా ఆదేశించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ సెంట్రల్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌, ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఫౌండేషన్‌, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.