జీవితంలో కొన్ని పీడకలలు మనిషి ఎప్పటికి మరిచిపోలేడు. అవి నిజం కాకూడదని కోరుకుంటారు. అయితే అలాంటివి ఘటనలు ఎక్కడో ఒక చోట జరిగే ఉంటాయని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది. అప్పుడు ఊహించని ఆశ్చర్యం కలుగుతుంది. అదే తరహాలో నిజ జీవితంలోని సంఘటన ఆధారంగా పిహు అనే కథను రూపొందించారు వినోద్ కాప్రి.

రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండేళ్ల పాప ఇంట్లో తనకు తానే లేచి ఇష్టమైన బొమ్మలతో ఆదుకోవడం. టీవీ ఆన్ చేసి డ్యాన్స్ చేయడం. తినడానికి ప్రయత్నించడం. గ్యాస్ వెలిగించడం. చూస్తుంటేనే ఒక్కసారిగా గుండెల్లో భయాన్ని కలిగిస్తోంది. నవ్వడం ఆడుకోవడం ఆకలి తప్ప ఇంకేమి తెలియని ఆ చిన్నారి తల్లిని నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది. ఆ షాట్స్ ఎంతో ఎమోషనల్ గా ఉన్నాయి. 

కానీ ఆమె మరణించిన సంగతి ఆ పాపకు తెలియదు. ట్రైలర్ లో ప్రతి సన్నివేశం చాలా రియలిస్టిక్ గా ఉందనిపిస్తోంది. చివరలో బాల్కనీ నుంచి బొమ్మ పడిపోవడంతో చిన్నారి ఎక్కే ప్రయత్నం చేసే సీన్ నోట మాట రానివ్వట్లేదు. నిజగానే ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయి. తల్లి మరణించిన సంగతి కూడా తెలియని చిన్నారులు ఇట్లోనే తల్లి శవం పక్కన రెండు మూడు రోజుల వరకు గడిపిన ఘటనలు పట్టణాల్లో ఎన్నో సార్లు బయటపడ్డాయి. 

విదేశాల్లో అయితే ఇలాంటి దారుణాలకు లెక్కే లేదు. ఇక భయంతో కూడిన భావోద్వేగాన్ని కలిగిస్తోన్న ఈ పిహు ట్రైలర్ బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నవంబర్ 16న సినిమాను విడుదల చేయనున్నారు.