తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు హీరోయిన్ పాయల్ ఘోష్‌‌పై బాలీవుడ్ నటి రిచా చద్దా రూ.1.1 కోట్ల పరువు నష్టం దావా వేసింది.  స్టార్ డైరక్టర్, నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై రేప్ ఆరోపణలు చేస్తూ మధ్యలో రిచా చద్దా గురించి పాయల్ అసభ్యకరంగా మాట్లాడింది. ఒక తెలుగు ఛానల్‌‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అనురాగ్ కశ్యప్‌‌ గురించి పాయల్ మాట్లాడుతూ మధ్యలో చద్దా ప్రస్తావన తీసుకొచ్చింది. 

‘మీరు (కశ్యప్) రిచా చద్దా, మహీ గిల్, హూమా ఖురేషి లాంటి మామూలుగా కనిపించే అమ్మాయిలకు అవకాశం ఇచ్చారు. సాధారణంగా డైరెక్టర్లు వారికి చాన్సెస్ ఇవ్వరు. కానీ మీరు ఇచ్చారు. నేను దీనికి మానిసికంగా సిద్ధంగా లేను’ అని అనురాగ్ కశ్యప్‌‌ను ఉద్దేశించి పాయల్ కామెంట్స్ చేసింది. కశ్యప్‌‌కు జస్ట్ ఓ కాల్ దూరంలోనే ఉంటుందంటూ రిచా చద్దా గురించి పాయల్ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.   తాను ఫోన్‌ చేస్తే చాలు ముగ్గురు హీరోయిన్లు రిచా చద్దా, మహీ గిల్‌, హ్యుమా ఖురేషీలు తన వద్దకు వస్తారంటూ కశ్యప్‌ ఆ సమయంలో చెప్పినట్లు’ పాయల్‌ పేర్కొన్నారు. దీంతో రిచా చద్దా సీరియస్ అయ్యింది. 

ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా తాను సంపాదించుకున్న పేరుకు హాని కలిగించేలా పాయల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆమెపై పరువు నష్టం దావా వేసింది. తాను ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదని ఆమె వెల్లడించారు. పాయల్‌ చేసిన వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నష్ట పరిహారంగా ఒక కోటి 10 లక్షల రూపాయలను డిమాండ్‌ చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన జస్టిస్ ఎకే మీనన్ ఏకసభ్య ధర్మాసనం పాయల్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకుంటే సరిపోతుందా అని రిచా తరపు న్యాయవాదిని అడిగారు.  

దీనిపై స్పందించిన పాయల్.. కేవలం తను అనురాగ్‌ మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిని తప్పుడు ఆరోపణగా పేర్కొంటూ.. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని తెలిపారు. అసలు తన పేరు తీసినందుకు అనురాగ్‌ కశ్యప్‌ను రిచా ప్రశ్నించాలని పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. మరో వైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్‌ కశ్యప్‌కు బాలీవుడ్‌ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది.