2018లో విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం తరువాత పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్...సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఇది ఆయన ఫ్యాన్స్ లో ఒక వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.ఇకపై వెండితెరపై పవన్ ని చూడలేమన్న ఆవేదనకు వారు గురి కావడం జరిగింది. ఐతే అందరికీ షాక్ ఇస్తూ పవన్ తన కమ్ బ్యాక్ ప్రకటించారు. 

వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ వెంటనే క్రిష్ దర్శకత్వంలో తన 27వ చిత్రం, దర్శకుడు హరీష్ శంకర్ తో 28వ  చిత్రం చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కొద్దిరోజుల క్రితం దర్శకుడు సురేంధర్ రెడ్డితో మరో కొత్త చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించి సంచలనం రేపారు. ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన పవన్ ఐదవ చిత్రం కూడా ప్రకటించేశారు. 

ఈసారి అనూహ్యంగా పవన్ ఓ యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారు. అప్పట్లో ఒకడుండేవాడు అనే చిత్రం ద్వారా ఫేమ్ తెచ్చుకున్న సాగర్ కే చంద్ర పవన్ 30వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఐతే ఈ మూవీలో పవన్ ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా, మిగతా నటుల వివరాలు తెలియాల్సి ఉంది.