గుంటూరు హాయ్ లాండ్ లో మెగా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఎందుకు మారిందో మెగాస్టార్ వివరిస్తారంటున్న అల్లు అరవింద్ ప్రీ రిలీజ్ కు పవన్ కళ్యాణ్ రాలేకపోతున్నారని స్పష్టీకరణ కారణాలు వేరే అంటున్న విశ్లేషకులు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు కారణాల మూలంగా అనుకోకుండా విజయవాడ నుంచి వేదిక మార్చాల్సి రావటంతో ఏర్పాట్లను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
గుంటూరులోని హాయ్ లాండ్ లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడగా.. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఈ వేడుకకు అనుమతులు వచ్చినట్టుగా ప్రకటించారు. అయితే వేదిక మార్చాల్సిన అవసరం అసలుండిందా.. లేకుంటే ఎందుకు మార్చాల్సివచ్చిందో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వివరిస్తారని అరవింద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే ఖైదీ వేడుకకు అనుమతి ఇవ్వలేదని మెగా అభిమానులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మెగా స్టార్ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది.
మెగా హీరోలందరూ ఈ వేడుకలో పాల్గొంటారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా అన్న అనుమానం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ విషయం పై కూడా క్లారిటీ ఇచ్చిన అరవింద్, పవన్ ఖైదీ వేడుకకు హాజరు కావటం లేదని తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రాలేకపోతున్నారని స్పష్టం చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ రావాలనుకుంటే తప్పక రావచ్చు కానీ వస్తే అనేక అంశాల్లో క్లారిటీ దెబ్బతింటుంది. ముఖ్యంగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రస్థుతం జనాల్లోకి వెళ్తూ సమస్యలపై పోరాటం ముమ్మరం చేశారు. పవన్ జనసేన అధినేతగా ప్రస్థుతం ఒక రేంజ్ లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్నయ్య చిరంజీవి ఫంక్షన్ కు హాజరైతే.. జనం తప్పుగా ఆలోచించే పరిస్థితులు తలెత్తుతాయని. అలా జరగకుండా ముందే కట్టడి చేయాలంటే ఫంక్షన్ కు హాజరు కాకుండా ఉండటమే ఉత్తమమని భావిస్తున్నాడట.
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు.
