చేతిలో ఈటెతో పవన్ కళ్యాణ్ వేయి మందిపై విరుచుకుపడితే ఎలా ఉంటుంది. ఎలాంటి మాస్ సన్నివేశం కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తుండగా.. ఆ కల సాకారం కానున్నట్లు సమాచారం అందుతుంది.


పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఫ్యాన్స్ ఆయన సినిమాల పట్ల ఒకింత నిరాశగా ఉన్నారు. కమ్ బ్యాక్ తర్వాత పవన్ వరుసగా రీమేక్ చిత్రాలు చేశారు. అది కూడా హీరోయిజం కి పెద్దగా స్కోప్ లేని కథలతో. పవన్ కోసం వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల్లో ఫైట్స్, డైలాగ్స్ జోడించినప్పటికీ ఫ్యాన్స్ కోరుకుంటుంది మాత్రం ఓ మాస్ స్ట్రెయిట్ మూవీ. మరో వైపు టాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా హీరోలుగా అవతారం ఎత్తుతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ హిందీలో కూడా మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. 

పవన్ సైతం బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులపాలని కోరుకుంటున్నారు. వారి కోరికలన్నీ తీర్చే స్కోప్ హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమాకుంది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే మొగలుల నేపథ్యంలో నడిచే కథ కావడంతో హరి హర వీరమల్లు పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు క్రిష్ హరి హర వీరమల్లు ని గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు. 

కాగా ఈ మూవీకి సంబంధించి మరొక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. హరి హర వీరమల్లు చిత్రంలో పవన్ ఏకంగా వేయి మందితో యుద్దానికి దిగుతాడట. వందల మందిని ఒక్కడే ఎదిరించే ఫైట్ సీక్వెన్స్ హరి హర వీరమల్లు చిత్రంలో ఉంటుందట. సినిమాకే ఈ సీన్ హైలెట్ కానున్నాడనేది విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ ఇదే తరహా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నారు. హరి హర వీరమల్లు మూవీలో పవన్ తన ఫ్యాన్స్ కి ఈ భారీ ట్రీట్ ఇవ్వనున్నారు. 

స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం హరిహర వీరమల్లు మూవీ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే హరి హర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభమైంది. కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నర్గీస్ ఫక్రి సైతం ఈ మూవీలో నటిస్తున్నారు.