జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. దేశ ప్రజల సంక్షేమం, రెండు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యం కోసం పవన్ కల్యాణ్ చతుర్మాస దీక్షను ప్రారంభించారు. నాలుగుమాసాల పాటు చతుర్మాస దీక్ష కొనసాగనుంది. దీక్షా సమయంలో పవన్ కల్యాణ్ ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు. తొలి ఏకాదశి నాటి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి నాడు పవన్ కల్యాణ్ దీక్షను విరమిస్తారు. 

దీక్ష విరమణ సమయంలో హోమాన్ని కూడా పవన్ కల్యాణ్ నిర్వహించనున్నారు. నాలుగు నెలల పాటు అన్నింటికి పవన్ కల్యాణ్ దూరంగా ఉంటారు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇక 2020ని పూర్తిగా కరోనా ఆక్రమించేయటంతో  2021 నాటికి పెండింగు పనులు అన్నీ పూర్తి చేసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారుట. పెండింగు పనులు అంటే సినిమా షూటింగులు వగైరాలన్న మాట. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడతారట.

 ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌ ‘వకీల్ సాబ్’ మూవీలో నటిస్తున్నాడు. ఆ మధ్యన  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో టైటిల్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. పింక్‌ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్రను పోషించాడు. అదే లాయర్ పాత్రను తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.  

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇదే సినిమాను తమిళంలో  అజిత్ హీరోగా ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది.