పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌` నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ట్రీట్‌ వచ్చింది. మహిళలకు కొత్త పోస్టర్‌తో విషెస్‌ చెప్పారు పవన్‌ అండ్‌ `వకీల్‌ సాబ్‌` టీమ్‌. ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్న ముగ్గురు అమ్మాయిలను పరిచయం చేశారు. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల లుక్‌లను విడుదల చేశారు. వీరి ముదు చైర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఓ చేతిలో కర్ర, మరో చేతిలో బుక్‌ పట్టుకుని కూర్చొని ఉన్న పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో హిందీ `పింక్‌`కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన `సత్యమేవ జయతే` పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌ లో మిలియన్స్ వ్యూస్‌ని రాబట్టుకుంటోంది. పవన్‌ కళ్యాణ్‌ రెండేళ్ల గ్యాప్‌ తో రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రమిది కావడం విశేషం. దీంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే మహాశివరాత్రి సందర్భంగా మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారు పవన్‌. ఆయన క్రిష్‌ దర్శకత్వంలోనటిస్తున్న `పీఎస్‌పీకే27`(వర్కింగ్‌ టైటిల్‌) చిత్ర ఫస్ట్ లుక్‌, టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ గ్లింప్స్ కూడా ఇవ్వబోతుంది యూనిట్‌. దీనికి `హరిహర వీరమల్లు` అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టు టాక్‌.