Asianet News TeluguAsianet News Telugu

ఆ వస్తువులను త్యజిద్దాం.. పవన్‌ చెబుతున్న వినాయకుడి పూజ

పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు సందేశాన్నిచ్చారు. వినాయకుడి పూజా ఎలా చేయాలో చెబుతున్నాడు. విదేశీ వస్తువులను వాడకూడదని తెలిపారు.

pawan kalyan said that one should worship ganesh festival without foreign   objects
Author
Hyderabad, First Published Aug 21, 2020, 3:51 PM IST

పవన్‌ కళ్యాణ్‌ కాసేపు రాజకీయాలు వదిలేశాడు. పూర్తిగా భక్తిలో మునిగిపోయాడు. అంతేకాదు జనానికి హితబోధ చేస్తున్నాడు. విదేశీ వస్తువులతో గణేష్‌ పూజ చేయొద్దన్నారు. స్వదేశానికే ప్రయారిటీ ఇవ్వాలని తెలిపారు. మొత్తంగా వినాయకుడి పూజ ఎలా చేయాలో చెబుతూ, ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం. 

హిందువులకు మొదటి పండుగ వినాయక చతుర్ధి అని, ఏ పని తలపెట్టినా విఘ్నాలు కలుకకుండా చూడమని వినాయకుడిని వేడుకునే పండుగ అని చెప్పాడు. `కరోనా అనే ఈ భయంకర విఘ్నం నుంచి దేశ ప్రజలందరినీ కాపాడమని ముందుగా ఈ విఘ్ననాయకుడ్ని ప్రార్థిస్తున్నాను. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే పండుగ మన  వినాయక చవితి. ఒక విధంగా చెప్పాలంటే మన దేశ సమైక్యతకు, దేశ భక్తికి ప్రతీక ఈ పండుగ. ఈ సారి మన దేశభక్తిని ఈ పండుగలో ప్రతిబింబింప చేద్దాం` అని అన్నారు. 

ఇంకా చెబుతూ, మనకు తెలియకుండానే విదేశీ వస్తువులు మన జీవితంలో భాగమైపోతున్నాయి. మన కార్మికులు శ్రమించి రూపొందించిన వస్తువులకు మార్కెట్‌ లేకుండా పోతుంది. మన వినాయక పూజలో సైతం విదేశీ పూజా ద్రవ్యాలు సింహ భాగం కనిపిస్తున్నాయి. ఈ పూజ నుంచి అయినా మనం విదేశీ వస్తువులను త్యజిద్దాం. మన నేలపై తయారైన వస్తువులనే వాడదాం. తద్వారా మనదేశ ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధికి దోహదపడదాం. మన భారతీయులు, మన గడ్డపై ఉత్పత్తి చేసిన పర్యావరణ హితమైన పూజా ద్రవ్యాలతోనే ఈ పండుగ జరుపుకొందాం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు,తెలుగు వారందరికీ నా తరుపున, జనసేన పార్టీ తరపున వినాయకచవితి శుభాకాంక్షలు` అని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios