మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో సినీ వర్గాల్లో, అటు తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లోనూ అందోళన నెలకొంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే చిరంజీవి సీఎం కేసీఆర్‌ని కలిశారు. అయితే చిరంజీవి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అనేక మంది సినీ ప్రముఖులు ట్విట్టర్ల ద్వారా కోరుకుంటున్నారు. 

తాజాగా చిరు తమ్ముడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. సత్వరమే కోలుకోవాలని పేర్కొన్నారు. `అన్నయ్య చిరంజీవి లాక్‌ డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యం పట్లా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నయ్య కరోనా బారిన పడటంతో మేమంతా విస్తూ పోయాం. ఎలాంటి లక్షణాలు లేకుండా, పరీక్షల్లో మాత్రం పాజిటివ్‌ అని తేలింది. 

అన్నయ్య సత్వరమే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కోసం సాగుతున్న ప్రయోగాలు త్వరగా ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచం అంతా ఆ వ్యాక్సిన్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రమాదం ఉందనే వైద్య ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా` అని పవన్‌ పేర్కొన్నారు. 

పవన్‌ ప్రస్తుతం `వకీల్‌సాబ్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్‌ మెట్రోలో జర్నీ చేసి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో అంజలి, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా, శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.