జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రపురి కాలనీ భూముల వివాదం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళింది. తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. 1994లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుతం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికుల కోసం ఇళ్ల స్థలాలని కేటాయించింది. 

కానీ ఆ భూముల కమిటీ సభ్యుల అవినీతి వల్ల తమకు ఇళ్ళు దక్కకుండా పోయాయని సినీ కార్మికులు గత కొన్ని నెలలుగా నిరసన తెలియజేస్తున్నారు. కాగా నేడు సినీ కార్మికులు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలుసుకున్నారు. పవన్ ఈ సమస్యపై సినీ కార్మికులకు భరోసా కల్పించారు. 

తెలుగు భాషకు రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమకు మాత్రం హైదరాబాద్ కేంద్రంగా ఉంది. అక్కడ పనిచేస్తున్న సినీ కార్మికుల ఇంటి కల నెరవేరాలి. ఈ సమస్య గురించి తానూ పరుచూరి వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారితో చర్చిస్తానని పవన్ తెలిపారు.