ఆదిసాయికుమార్‌, సురభి జంటగా నటించిన చిత్రం `శశి`. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్పీ వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేశారు. చిత్ర బృందం ఆయన్ని ప్రత్యేకంగా కలిసి, ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ని విడుదల చేయించారు. ఈ సందర్భంగా పవన్‌ చిత్ర బృందాన్ని అభినందించారు. ట్రైలర్ బాగుందని ప్రశంసించారు. ఇక తాజాగా విడుదలైన విశేషంగా ఆకట్టుకుంటుంది. విడుదలైన కాసేపట్లోనే లక్షల వ్యూస్‌ రావడం విశేషం. 

ఇందులో `మనం ప్రేమించిన వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఎంత దైర్యంగా ఉంటుందో, ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది`.., `మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి`, `శశి అంటే రెండక్షరాలు కాదు వాడికి. మనిద్దరం. ఏ ఒక్కరు లేకపోయినా తట్టుకోలేడు`, `నీలాంటి కుర్రాడి ప్రేమ పెళ్లయ్యేంత వరకు హ్యాపీ మాత్రమే ఆలోచిస్తుంది. కానీ నాలాంటి తండ్రి ప్రేమ లైఫ్‌ లాంగ్‌ హ్యాపీగా ఉండటానికి ఆలోచిస్తుంది`, 

`ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు, ఉన్నచోట నిలబెట్టుకోవడం..`, `మనల్ని ప్రేమించేవారు మనల్ని ఎప్పటికీ బాధపెట్టరు `, `ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా, పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ ముర్ఖత్వం` అనే డైలాగులు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది పూర్తి లవ్‌ స్టోరీపై సాగే చిత్రంగా కనిపిస్తుంది. అమ్మాయి కోసం పిచ్చివాడిగా మారిన పాత్రలో ఆది కనిపిస్తారని అర్థమవుతుంది.