పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కోలుకున్నారు. గత నెలలో ఆయన కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శనివారం ఆయన కోలుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ నోట్‌ని విడుదల చేశారు. ఇందులో ఆయన చెబుతూ, `కరోనా బారిన పడిన పవన్‌ కళ్యాణ్‌కి వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్‌.టి.పి.సి.ఆర్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగటివ్‌ రిపోర్ట్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని, ఆరోగ్యపరంగా పవన్‌కి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. 

తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించిన వారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్‌ కృతజ్ఞతలు తెలియజేవారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు` అని హరిప్రసాద్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పవన్‌కి కరోనా సోకి ఇరవై రోజులవుతున్న ఇంకా హెల్త్ అప్‌డేట్‌ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆందోళన చెందిన విషయం తెలిసిందే. తాజాగా వారికి గుడ్‌ న్యూస్‌ చెప్పడంతో ఫ్యాన్స్‌ రిలాక్స్ అవుతున్నారు.

పవన్‌ ఇటీవల `వకీల్‌సాబ్‌`తో ఆడియెన్స్ ని పలకరించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. దీంతోపాటు ప్రస్తుతం ఆయన క్రిష్‌ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు`తోపాటు `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో రానాతో కలిసి నటిస్తున్నారు. దీనికి సాగర్‌ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.