ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ 30వ సినిమా తెరకెక్కాల్సిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఆగిపోయింది. త్రివిక్రమ్‌ స్థానంలో కొరటాల శివతో ఎన్టీఆర్‌ 30 సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ సినిమా క్యాన్సిల్‌కి కారణమేంటనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. తాజాగా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్‌ సినిమా క్యాన్సిల్‌ కావడానికి పవన కళ్యాణే కారణమనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. 

పవన్‌ కళ్యాణ్‌ మలయాళ సూపర్‌ హిట్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. దీనికి సాగర్‌ కె చంద్ర దర్శకుడు. కానీ మాటలు, స్క్రీన్‌ప్లేని మాత్రం త్రివిక్రమ్‌ అందిస్తున్నారు. కేవలం స్క్రీన్‌ప్లే, డైలాగులు మాత్రమే కాదు, పరోక్షంగా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారట. అంటే ఆల్మోస్ట్ ఈ సినిమాని త్రివిక్రమే అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఈ సినిమాకి త్రివిక్రమ్‌ పనిచేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాకి సంబంధించి కంప్లీట్‌ స్క్రిప్ట్ రెడీ చేయలేకపోయారట. దీంతో  ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్‌ పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. 

అయితే ప్రస్తుతానికి ఈ సినిమాల లేదని, భవిష్యత్‌లో కచ్చితంగా ఈ కాంబినేషన్‌లో సినిమా చేస్తామని నిర్మాత సూర్యదేవరనాగవంశీ ప్రకటించారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌ మరోవైపు మహేష్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. అనంతరం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లోనే చేయబోతున్నారనే టాక్‌ వినిపిస్తుంది. ఈ లెక్క ప్రకారం మహేష్‌తో సినిమా పూర్తయ్యాక మళ్లీ ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కనుందని టాక్‌. మరి ఈ లోపు ఇంకా ఎన్ని మార్పులైనా జరగొచ్చు. సెట్‌పైకి వచ్చేంత వరకు ఏదీ కన్ఫమ్‌గా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎన్టీఆర్‌- కొరటాల చిత్రం జూన్‌లో ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్‌- కొరటాల కాంబినేషన్‌లో గతంలో `జనతా గ్యారేజ్‌` వచ్చిన విషయం తెలిసిందే.