పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో సినిమా చేయాలని ఉందన్నాడు దర్శకుడు సుజీత్. ఇద్దరితో కలిసి భారీ మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడట. తాజాగా ఈ విషయం చెప్పి దుమారం రేపాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోలుగా మల్టీస్టారర్ అంటే ఏమైనా ఉందా? అసలు ఈ మాట వినడానికే సంచలనంగా అనిపిస్తుంది. ఈ ఆలోచనే ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంటుంది. అలాంటిది ఓ దర్శకుడు ఈ ఇద్దరితో మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అవును దర్శకుడు సుజీత్ తన మనసులో మాట బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లతో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందన్నారు. ఈ ఇద్దరితో సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని తెలిపాడు. ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించే విషయం చెప్పి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాడు.
తాజాగా `భజేవాయువేగం` మూవీ ప్రమోషన్‌లో భాగంగా కార్తికేయతో చిట్‌చాట్ చేశాడు దర్శకుడు సుజీత్. ఈ సందర్భంగా `ఓజీ` అప్‌డేట్ ఇచ్చాడు. అలాగే, పవన్, ప్రభాస్‌లతో మల్టీస్టారర్ చేయాలనేది తన డ్రీమ్ అని తెలపడం విశేషం. మరి ఈ ఆలోచన ఎంత వరకు ముందుకెళ్తుంది, ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది. అసలు సాధ్యమవుతుందా అనేది పెద్ద ప్రశ్నతోపాటు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విషయమని చెప్పొచ్చు.
ఇక `ఓజీ` గురించి దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ, ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని చూపిస్తానని తెలిపారు. ఫ్యాన్స్ అంతా పవన్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని తెలిపాడు సుజీత్. ఇక `ఓజీ`ని రీమేక్ గా చేయాల్సిందన్నారు. సినిమాలో కార్వ్ మాగా అండ్ ఐకిడో బ్యాక్ డ్రాప్ పైట్ సీన్లు షూట్ చేస్తున్నారట. ఈ యాక్షన్ సీన్లు బాగా రావాలి అని చెప్పి ముంబయి నుంచి పూనే నుంచి మాస్టర్స్ ని పిలిపించారట పవన్. వారి సమక్షంలో ప్రాక్టీస్ చేసి షూట్ చేస్తున్నారట.
ఇక సుజీత్ స్టయిలీష్ మూవీస్‌తో అదరగొట్టాడు. `సాహో` తర్వాత ఇప్పుడు ఆయన పవన్‌తో `ఓజీ` చేస్తున్న విసయం తెలిసిందే. ఈ మూవీ చాలా వరకు షూటింగ్ పూర్తయ్యింది. పవన్ మరో పదిహేను ఇరవై రోజుల డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుంది. ఇప్పటికే టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ట్రైలర్ని కూడా రెడీ చేశాడట సుజీత్. ఇందులో పవన్ మాస్టర్ గా కనిపిస్తాడు. ఆయన పూర్తి పేరు ఓజాస్ గాంభీర అని తెలిపాడు. ఇలా `ఓజీ` గురించి క్రేజీ విషయాలు చెప్పి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు సుజీత్.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఓజీ`లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతుంది యూనిట్. ఏపీ ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనే ఛాన్స్ ఉంది.
