తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్‌ కదిలింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యం హైదరాబాద్‌ నగరం నీట మునిగి సముద్రాన్ని తలపిస్తుంది. అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇంకా నగరం కోలుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు, వారికి సహాయం చేసేందుకు భారీగా ఫండ్‌ కావాలి. 

అందుకు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు కదిలారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కోసం విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటికే అనేక మంది తారలు తమ విరాళాలు ప్రకటించగా, తాజాగా ప్రభాస్‌, పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ప్రభాస్‌ కోటీ యాభై లక్షలు విరాళంగా ప్రకటించగా, పవన్‌ కళ్యాణ్‌ కోటీ రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌గా ఈ మొత్తాన్ని అందించబోతున్నారు. 

వీరితోపాటు రవితేజ పది లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ పదిలక్షలు, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ పది లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే చిరంజీవి, మహేష్‌బాబు చెరో కోటీ రూపాయలు, నాగార్జున, ఎన్టీఆర్‌ చెరో యాభై లక్షలు, విజయ్‌ దేవరకొండ పది లక్షలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.