Pawan Kalyan: పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ... అయోమయంలో ఆ మూడు సినిమాలు!
పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారింది. పైకి మాట్లాడకున్నా లోలోపల మదనపడుతున్నారు. ఒకటికి మూడు సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యారు. వీటిలో ఒక్కటి కూడా సమీపకాలంలో పూర్తయ్యే పరిస్థితి లేదు.

ఏపీ ఎన్నికలు టార్గెట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ భావించారు. ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్స్ కూడా అనుకున్న ప్రకారం జరగడం లేదు. పవన్ కళ్యాణ్ సమయం ఇచ్చినప్పుడు హడావుడిగా లాగించేస్తున్నాడు. ఫిక్స్డ్ షెడ్యూల్స్ అంటూ ఏమీ ఉండటం లేదు. నారా చంద్రబాబు అరెస్ట్ కాగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి హుటాహుటిన ఏపీకి వెళ్లారు పవన్ కళ్యాణ్. దాంతో హరీష్ ఇతర నటులతో షూటింగ్ చేసుకున్నారు.
ఏపీ రాజకీయాలతో ఊపిరి సలపనంతగా బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. బీజేపీ పార్టీతో కలిసి తెలంగాణాలో కొన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా చేయనున్నారట. మరోవైపు ఆరు నెలల్లో ఏపీ ఎన్నికలు. అక్కడ టీడీపీతో పొత్తు ప్రకటించారు. సీట్ల పంపకాలు, టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో, ప్రచారం, కేడర్ బలోపేతం... ఇలా సవాలక్ష లక్ష్యాలు ముందున్నాయి.
చూస్తుంటే పవన్ కళ్యాణ్... వారం, పది రోజులు కూడా ఉస్తాద్, ఓజీ చిత్రాల షూటింగ్స్ కి కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ఓజీ, హరి హర వీరమల్లు ఎన్నికల తర్వాతే అని ఫిక్స్ అయ్యారు. ఉస్తాద్ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని ప్లాన్. కానీ అది అసాధ్యమే కావచ్చు. అరకొరగా తీసి హడావుడిగా విడుదల చేస్తే... మొదటికే మోసం రావచ్చు.
పవన్ కళ్యాణ్ ఒకటికి నాలుగు సినిమాలు ఒప్పుకుని అడ్వాన్సులు తీసుకుంటున్నారు. అన్నీ సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఒక సినిమాకే సమయం కేటాయిస్తే... కనీసం ఒకటైనా విడుదలయ్యేది. హరిహర వీరమల్లుతో దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ ఎం రత్నం ఇరుకునపడ్డారన్నది నిజం. పవన్ ప్రాజెక్ట్ వలన హరీష్ శంకర్ దాదాపు మూడేళ్లు కోల్పోయాడు. ఈ గ్యాప్ లో కనీసం రెండు సినిమాలు చేసుకునేవాడు.
ఓజీ టీం కొంతలో కొంత సేఫ్. ఇటీవల ఓ వేదికలో మాట్లాడుతూ పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా టైటిల్ కూడా మర్చిపోయాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా అంటే ఆయనకు ఎంత ఫ్యాషనో. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలని కండీషన్ పెట్టి రీమేక్స్ ఎంచుకుంటున్నారు. కమ్ బ్యాక్ తర్వాత పవన్ కళ్యాణ్ విడుదల చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో రీమేక్స్ కావడం గమనించాల్సిన విషయం... బ్రో ప్లాప్ కాగా, భీమ్లా నాయక్ స్వల్ప నష్టాలు మిగిల్చింది. వకీల్ సాబ్ మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటింది. పవన్ సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోతుండగా... కామన్ ఆడియన్స్ ఆసక్తి చూపడం లేదు. ఇది పవన్ కెరీర్ కే ప్రమాదం...