ఫ్యాన్స్ మనోభావాలు పవన్ కి అసలు పట్టడం లేదు. తనని దేవుడిగా ఆరాధించే అభిమానుల సలహాలు తీసుకోవడం లేదు. తనకు అనిపించింది చేస్తూ ముందుకు వెళుతున్నారు.
పాలిటిక్స్ పేరుతో బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan)... కమ్ బ్యాక్ ఓ రీమేక్ తో చేశారు. హిందీ హిట్ మూవీ పింక్ ని తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కించారు. సీరియస్ పొలిటీషియన్ గా మారిన పవన్ సోషల్ మెసేజ్ తో కూడిన పింక్ రీమేక్ ఎంచుకున్నాడని అందరూ భావించారు. పింక్ రీమేక్ విషయంలో ఫ్యాన్స్ నుండి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. తర్వాత వరుసగా ఆయన స్ట్రెయిట్ కమర్షియల్ చిత్రాలు ప్రకటించారు. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాలలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి.
కానీ ఒప్పుకున్న చిత్రాలు పక్కన పెట్టి మరో రీమేక్ తెరపైకి తెచ్చాడు. త్రివిక్రమ్ ఆప్తుడు, నిర్మాణ భాగస్వామి అయిన సూర్యదేవర నాగవంశీ వద్ద మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ హక్కులు ఉన్న నేపథ్యంలో ఆ చిత్రం చేసేలా పవన్ ని పురిగోల్పోయారు. తక్కువ సమయంలో మూవీ పూర్తి చేసే ఒప్పందంపై హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలను కాదని భీమ్లా నాయక్ పూర్తి చేశారు. వరుసగా రీమేక్స్ చేస్తున్న తరుణంలో యాంటీ ఫ్యాన్స్ నుండి సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
పవన్ ని రీమేక్ స్టార్ అంటూ యాంటీ ఫ్యాన్స్ ఎగతాళి చేయడం అభిమానులకు నచ్చడం లేదు. ఈ క్రమంలో రీమేక్స్ చేయొద్దని, ఒకవేళ చేసినా ఇమేజ్ సరిపోయే చిత్రాలు ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ చిత్రం వినోదయ సితం (vinodhaya sitham) తెరపైకి వచ్చింది. ఈ చిత్ర రీమేక్ ని పవన్ డైహార్డ్ ఫ్యాన్స్ సైతం వ్యతిరేకిస్తున్నారు. ఆ చిత్ర కథ పవన్ ఇమేజ్ కి సరిపోయేది కాదంటున్నారు. అందులోనూ పవన్ పాత్రకు పెద్దగా నిడివి ఉండదు. గతంలో పవన్ చేసిన గోపాల గోపాల చిత్రానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ రీమేక్ అసలు చెయ్యొద్దంటున్నారు.
అయితే పవన్ మాత్రం ఈ మూవీ చేయడానికి సిద్ధమైపోయారు. దర్శకుడు సముద్ర ఖని కూడా ధృవీకరించడం జరిగింది. మరి ఫ్యాన్స్ ఇంత మొత్తుకున్నా పవన్ వెనక్కి తగ్గలేదని అర్థమవుతుంది. దీంతో హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ మరింత ఆలస్యం కానున్నాయి. కమ్ బ్యాక్ తర్వాత వరుసగా మూడో రీమేక్ పవన్ విడుదల చేయనున్నాడు. ఫ్యాన్స్ కి ఇష్టం లేకపోయినా పవన్ రీమేక్స్ చేయడం వెనుక ఓ కారణంగా కూడా ఉంది. ఆయన ఎంచుకునే రీమేక్స్ అన్ని తక్కువ నిడివి పాత్ర కలిగినవి. ఇక 20-30 రోజుల కాల్షీట్స్ తో రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ ఆయనకు వస్తుంది. పాలిటిక్స్ కోసం డబ్బులు సమీకరిస్తున్న పవన్ దీన్ని సరైన మార్గంగా ఎంచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
