క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. 2022కి బాక్సాఫీసు వద్ద పెద్ద ఫైట్ తప్పేలా లేదు. మహేష్, పవన్ ఢీ కొట్టబోతున్నారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. మేగసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. జాక్వెలిన్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌లోని పవన్ ఫోటో లీకై హల్‌చల్ చేసింది. ఈ నేపథ్యంలో పవన్‌తన అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుగా విడుదల చేయబోతున్నారు. ఇందులో బందిపోటుగా పవన్ కనిపిస్తారని తెలుస్తుంది. మరోవైపు పవన్ నటించిన `వకీల్‌సాబ్` ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది. దీంతోపాటు పవన్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో నటిస్తున్నారు. రానా మరో హీరో. ఈ సినిమాని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ఏడాది గ్యాప్‌లోనే మూడు సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషీ చేయబోతున్నారు పవన్.
ఇదిలా ఉంటే వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద బిగ్ ఫైట్ తప్పేలా లేదు. ఇప్పటికే సంక్రాంతిబరిలో మహేష్ బాబు దిగారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `సర్కారువారిపాట`ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు పవన్ కూడా క్రిష్ డైరెక్షన్‌లో నటించే సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. జనరల్‌గా సంక్రాంతికి రెండుమూడు పెద్ద సినిమాలకు స్కోప్ ఉంది. మరీ ఇంత పెద్ద సినిమాలు బరీలో దిగితే అది బాక్సాఫీసు వద్ద దుమారం రేగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. కలెక్షన్లని పంచుకోవాల్సి వస్తుందని అంటున్నారు.
ఇలాంటి వివాదాలు గతంలో చాలా సందర్భాల్లో చోటు చేసుకుంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఎవరెవరు ఏ ఏ తేదీల్లో వస్తారనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతారని చెప్పడంలో అతిశయోక్తి. అభిమానుల హంగామాకి ఆకాశమే హద్దు కానుంది. అదే సమయంలో మహేష్, పవన్ ఒకేసారి బాక్సాఫీసు బరిలో, అది సంక్రాంతి బరిలో దిగడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.
