అంటే సుందరానికీ మూవీ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. వీకెండ్ ముగిసే నాటికి ఈ చిత్రం కనీసం 50% శాతం రికవరీ సాధించలేకపోయింది. హిట్ టాక్ తెచ్చుకొని కూడా అంటే సుందరానికీ అనూహ్యంగా ఫెయిల్ కావడానికి పవన్ కళ్యాణ్ నే కారణం అంటున్నారు.

సినిమాలు వేరు రాజకీయాలు వేరు... అంటే సుందరానికీ (Ante Sundaraniki)ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ ఇది. అయితే రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదిక సాక్షిగా పొలిటికల్ స్పీచ్ ఇచ్చి రాజకీయాలను, సినిమాలను ఆయన ఏకం చేశారు. అప్పటి నుండి ఏపీలో ఓ అనారోగ్యకర వాతావరణం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాలను ఓ వర్గం చూడడం మానేసింది. పవన్ స్పీచ్ రిపబ్లిక్ చిత్రం ఫలితాన్ని దారుణంగా దెబ్బతీసింది. మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఆ చిత్రం యావరేజ్ వసూళ్లు కూడా అందుకోలేకపోయింది. 

కాగా టికెట్స్ ధరల తగ్గింపుపై హీరో నాని(Nani) ఓపెన్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సెటైర్స్ పేల్చారు. ఇది జగన్ అభిమానులకు నచ్చలేదు. వైసీపీ సోషల్ మీడియా అప్పటి నుండి హీరో నానిని టార్గెట్ చేస్తున్నారు. ఇక అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ అతిధిగా రావడం రాజకీయ కోణం తీసుకుంది. గతంలో నాని ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడడం, సీఎం జగన్ కి బద్ధశత్రువుగా ఉన్న పవన్ తన సినిమా వేడుకకు అతిథిగా పిలవడం, వాళ్లకు నచ్చలేదు. ఏపీలో ఓ వర్గం ఈ సినిమాను అవైడ్ చేసినట్లు టాక్ ఉంది. 

అనూహ్యంగా అంటే సుందరానికీ హిట్ టాక్ తెచ్చుకొని కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో పవన్ (Pawan Kalyan)అభిమానులు సీఎం జగన్ పై చేసిన బ్యాడ్ సెంటిమెంట్ రివర్స్ లో పవన్ కి ఆపాదిస్తున్నారు. టికెట్స్ ధరల పెంపు విషయమై చిరంజీవి అధ్యక్షతన మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివతో పాటు మరికొందరు ప్రముఖులు జగన్ ని కలిశారు. అనంతరం విడుదలైన రాధే శ్యామ్, ఆచార్య ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ ని కలవడం వలెనే వాళ్ళ సినిమాలు పోయాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. 

ఇక మహేష్ మూవీకి కూడా ప్లాప్ టాక్ కట్టబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. కేవలం సీఎం జగన్ బ్యాడ్ సెంటిమెంట్ ప్రూవ్ చేయడం కోసం ఇలా చేశారు. అయితే సర్కారు వారి పాట భారీ వసూళ్లతో హిట్ అందుకుంది. కాగా పవన్ ముఖ్య అతిథిగా హాజరైన రిపబ్లిక్, అంటే సుందరానికీ చిత్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. కావున పవన్ అతిథిగా వస్తే ఆ సినిమా మటాషే అంటూ యాంటీ ఫ్యాన్స్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. హీరోలు పొలిటీషియన్స్ ని , పొలిటీషియన్స్ హీరోలను టార్గెట్ చేయడం వలన మధ్యలో నిర్మాతలు నలిగిపోతున్నారు.