తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగార్జునతో సినిమా తీసిన దర్శకుడు కిరణ్‌ కుమార్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ దర్శకుడు కేకే కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కిరణ్‌ కుమార్‌(కేకే) కన్నుమూశారు. నాగార్జునతో `కేడి` మూవీని రూపొందించిన దర్శకుడు కిరణ్‌ అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా దర్శకుడిగా రాణిస్తున్న సందీప్‌ రెడ్డి వంగా.. దర్శకుడు కిరణ్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయడం విశేషం. ఒక పాన్‌ ఇండియా దర్శకుడిగా ట్రైన్‌ చేసిన ఘనత కిరణ్‌ కుమార్‌కి దక్కుతుంది.

నాగార్జున `కేడి`తో దర్శకుడిగా కేకే పరిచయం

దర్శకుడు కిరణ్‌ కుమార్‌.. మణిరత్నం వద్ద పలు సినిమాలు అసిస్టెంట్‌గా పనిచేశాడు. దీంతో అప్పట్నుంచే కిరణ్‌లోని ప్రతిభని గమనించిన హీరో నాగార్జున `కేడి` చిత్రంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఇందులో నాగార్జునని చాలా స్టయిలీష్‌గా ఆవిష్కరించారు. అయితే సినిమా బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఆడియెన్స్ ని మెప్పించలేకపోయింది. దీంతో ఆ తర్వాత సినిమా ఆఫర్లు రాలేదు.

ప్రస్తుతం `కేజేక్యూ` చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న కేకే

ఇటీవల చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ `కేజేక్యూ`(కింగ్‌ జాకీ క్వీన్‌) పేరుతో ఓ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీలో ప్రముఖ యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల హీరోగా నటించగా, దీక్షిత్‌ శెట్టి మరో హీరోగా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇంతలోనే దర్శకుడు కిరణ్‌ కన్నుమూయడం అత్యంత విచారకరం.

`భద్రకాళి`లో నటుడిగా మెప్పించిన కేకే

కిరణ్‌ నటుడిగానూ మెప్పించారు. ఇటీవల విజయ్‌ ఆంటోని హీరోగా రూపొందిన `భద్రకాళి` మూవీలో కీలక పాత్రలో నటించాడు. ఒక స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. సెకండాఫ్‌లో తన సత్తాని చాటారు. ఆయన పాత్ర అదిరిపోయేలా ఉంటుంది. అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో దర్శకుడిగానే కాదు, నటుడిగా మెప్పించగలను అని నిరూపించారు కేకే. ఆయనకు నటుడిగా ఆఫర్లు చాలానే వచ్చేవి. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. కేకే మృతి పట్ల చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది. సందీప్‌ రెడ్డి వంగా తీవ్ర విచారానికి గురవుతున్నారు.