యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణాన్నిరూపొందించిన ప్రధాన ఆర్కిటెక్చర్‌, ఆర్ట్ డైరెక్టర్‌ ఆనంద సాయిని  జనసేన అధ్యక్షుడు, హీరో పవన్‌ కళ్యాణ్‌ సత్కరించారు. ఆనంద సాయి ఇటీవల `ధార్మిక రత్న` పురస్కారం అందుకున్నారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించారు. 

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌.. ఆనంద సాయిని అబినందించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయమన్నారు. ఆలయ నిర్మాణం, దానికి సంబంధించిన వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆనంద సాయికి ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితమన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు నర్రా శ్రీను పాల్గొన్నారు.

శ్రీశాంతి కృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి చేతుల మీదుగా ఆనంద సాయికి ధార్మిక రత్న పురస్కారాన్ని అందజేశారు. ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌, ఆనంద్‌ సాయి ఎప్పట్నుంచో మంచి స్నేహితులు. ఈ రకంగా తన ఫ్రెండ్‌షిప్‌ని చాటుకున్నారు.