పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలున్నాయి. ఇందులో రెండు సినిమాలు వెయిటింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు మరో రీమేక్ కి డేట్స్ సర్దుబాటు చేసే పనిలో ఉన్నారట.
పవన్ కళ్యాణ్ అందరిని ఆశ్చర్యపరిచేలా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రీమేక్‌లు, స్ట్రెయిట్ అనే తేడా లేకుండా సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సుజిత్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించబోతున్నారు.
మరోవైపు హరీష్ శంకర్‌తో `ఉస్తాద్ భగత్‌సింగ్` సినిమా చేస్తున్నారు. `థెరి` రీమేక్‌తోపాటు హరీష్ శంకర్ రాసుకున్న `భవదీయుడు భగత్ సింగ్` కథని మేళవించి ఈ సినిమాని రూపొందించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా కథానాయికగా నటించనుందని సమాచారం. ఇటీవల ఈ సినిమా కూడా ప్రారంభోత్సవం జరుపుకుంది.
దీంతోపాటు సురేంద్‌రెడ్డి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ దాని అప్‌డేట్ లేదు. దీంతో ఇప్పుడు ఆ సినిమా ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే పవన్.. తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` చిత్రం రీమేక్‌లోనూ నటించేందుకు ఇప్పటికే ఓకే చెప్పినట్టు వార్తలొచ్చాయి. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్ తో చేయబోయే ఈ రీమేక్‌కి కూడా సముద్రఖనినే దర్శకత్వం వహించబోతున్నారు.
అయితే ఈ సినిమా ఉండబోదని వార్తలొచ్చినా, లేటెస్ట్ సమాచారం మేరకు ఈసినిమాని చేసేందుకే పవన్ సుముఖంగా ఉన్నారట. అంతేకాదు డేట్స్ అడ్జెస్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇది మల్టీస్టారర్‌గా తెరకెక్కబోతుంది. కీలక పాత్రలో మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించనున్నారు. అయితే సినిమాకి తక్కువ కాల్షీట్లే అవసరం అవుతున్నాయట. అందుకే నెలకు ఓ ఐదు రోజులు కేటాయించాలని భావిస్తున్నారట. ఓ వైపు `హరిహర వీరమల్లు`తోపాటు `వినోదయ సీతం` చిత్ర రీమేక్ లోనూ నటించాలనే ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఇప్పుడు పవన్ `హరిహర వీరమల్లు` షూటింగ్ చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. ఆ సినిమా ఇంకా యాభై నుంచి ఆరవై శాతమే పూర్తయ్యిందని, ఇంకా సగం చిత్రీకరించాల్సి ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాని, రీమేక్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు, ఇది అయ్యే పననేనా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అక్కడ యాక్టీవ్‌గా తిరుగుతున్నారు. తరచూ మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటు రాజకీయాలను, ఇటు సినిమా షూటింగ్‌లను ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది సస్పెన్స్ గా మారింది.
