జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి జనంలోకి వస్తున్నారు. ఈ బుధ,గురువారాల్లో ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. డిసెంబర్ 9న ఆయన ఒంగోలులో పర్యటించి.. కృష్ణా పడవ ప్రమాద బాధితులను పవన్ పరామర్శించనున్నారు.

 

పవన్ కళ్యాణ్ పర్యటన మూడు విడతలుగా జరగనుంది. మురళీ కుటుంబానికి పరామర్శ పవన్ కళ్యాణ్ మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించనున్నారు. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న మురళీ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం ఉన్న పోలీస్ ఆంక్షలు సడలించిన తర్వాత పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తానని తెలిపారు. మురళి సోదరుడు రాజుతో మాట్లాడినప్పుడు అతని దుఖం తనను కలచివేసిందన్నారు. యువత నిస్పృహకు లోనుకావొద్దని, తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదైనా పోరాడి సాదిద్ధామని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.

 

‘యువతలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆశలు రేకెత్తించి వాటిని అమలు చేయకపోతే వచ్చే దుష్పరిణామాలకు వెంకటేశ్‌, మురళీ ఆత్మహత్యలే నిదర్శనం. యువతలో నిర్వేదం, నిరాశ చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వాల విధి. ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. యువత నిరాశకు గురికావొద్దని నా విజ్ఞప్తి. విలువైన ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దు. పోరాడండి. సాధించండి. నాతో పాటు జనసేన కూడా అండగా ఉంటుంది' పవన్ పిలుపునిచ్చారు.

 

ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలకు అండగా ఉంటానని పవన్ అన్నారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ పరం చేయడాన్ని ఆయన వ్యతిరేకించే అవకాశం ఉంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్‍‌ను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం యోచన నేపథ్యంలోనే వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ కంపెనీని ప్రైవేటు పరం చేస్తే.. తన చెల్లి పెళ్లికి చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆందోళనకు గురైన వెంకటేష్.. ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

ఇప్పటికే ఉద్ధానం బాధితుల కోసం విశాఖపట్నం వచ్చిన పవన్.. ఈసారి తన పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రంపై కూడా ఘాటుగా స్పందించే అవకాశాలున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా పవన్ పర్యటన కొనసాగనుందని తెలుస్తోంది. కాగా, ‘అంబేడ్కర్‌ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ పయనం కొనసాగుతుందని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఆశలకు, వాస్తవాలకు పొంతన లేక కూనారిల్లుతున్న యువత పరిస్థితి ఇలా ఉంటుందని అంబేడ్కర్‌ అప్పట్లో వూహించి ఉంటే రాజ్యాంగంలో ఒక అధ్యాయాన్ని యువత భవిష్యత్తు కోసం రాసి ఉండేవారేమో' అని పవన్‌ అభిప్రాయపడ్డారు.

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో తాను త్వ‌ర‌లోనే మూడు విడ‌త‌లుగా పర్య‌టించ‌నున్న‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. త‌న మొద‌టి ప‌ర్య‌ట‌నలో స‌మ‌స్య‌ల ప‌రిశీల‌న‌, అధ్య‌య‌నం, అవ‌గాహ‌న చేస్తాన‌ని చెప్పారు. రెండో విడ‌త ప‌ర్య‌ట‌న‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతాన‌ని అన్నారు. ఇక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌ని ప‌క్షంలో పోరాటాల వేదికగా మూడో విడ‌త ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం యువ‌త నిరాశతో ఉంద‌ని, యువ‌త‌ను జాగృతం చేసేందుకు 'చ‌లో రే చ‌లో' గీతాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని తెలిపారు.

 

‘ఇటీవల ఇంగ్లాండ్‌ పర్యటనలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఓ ప్రశ్న నన్ను అంతర్మథనంలో పడేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదాన్ని ఆ విద్యార్థి ప్రస్తావించాడు. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పడవ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తెదేపాకు మద్దతుగా ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసినందున మీరు కూడా బాధ్యులు కాదా?'' అని విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. ఆలోచిస్తే ఆ ప్రశ్నలో సహేతుకత ఉందనిపించింది. అందువల్ల ఆ పడవ ప్రమాదం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ కారణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంకటేశ్‌ ఆత్మహత్య ఉదంతంలో నా వంతు బాధ్యత కూడా ఉందని అంగీకరిస్తున్నా. వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపే వెళ్తున్నా' అని పవన్‌ వివరించారు.