జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఓ ట్వీట్ చేశాడు. అది కూడా తన సోదరుడు చిరంజీవి గురించి కావడం విశేషం. ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి 64వ జన్మదినం జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా పవన్ తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 

స్ఫూర్తి ప్రదాత చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి అంటే కేవలం ఒక మెగాస్టార్ కాదు. మూర్తీభవించిన స్ఫూర్తి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా పెద్ద కలలు కనడం ఆ కలలని సాకారం చేసుకునే దిశగా కష్టపడడం చిరంజీవి గారి జీవితానికి నిదర్శనం. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మూలాలు మరచిపోని వ్యక్తి అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. 

చిరంజీవి గారి జీవితం ఒక సందేశం. ఆయన సందేశాన్ని అనుసరించిన లక్షలాది మంది యువతలో నేను కూడా ఓ పరమాణువును. ఆయనకు నేను తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. చిరంజీవి నటనలో ఓనమాలు దిద్దిన తొలి రోజుల నుంచి ఇప్పటివరకు అదే క్రమశిక్షణతో కష్టపడుతున్నారని పవన్ తెలిపారు. 

చిరంజీవి తన జీవితంలో ఎన్నో కుట్రలని, ఒడిదుడుకులని చేధించుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితాన్ని సైరా చిత్రంగా అందిస్తున్న సందర్భంగా, ఆయన జన్మదినం సందర్భంగా నా తరుపున, జనసైనికుల తరుపున ఇవే నా శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు.