పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో సినిమాలు వదిలేసి రాజకీయాల వైపు పూర్తిగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధాని అమరావతిలో ఇల్లు కూడా కట్టుకునేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటివరకు ఏపీ పార్టీల అధినేతలెవ్వరికీ అమరావతిలో లేకున్నా పవన్ కల్యాణ్ అమరావతిలో గృహనిర్మాణానికి భూమి పూజ చేయటం గమనార్హం. చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డిలకు లేకున్నా పవన్ కల్యాణ్ మాత్రం అందరికన్నా ముందు గృహనిర్మాణం చేపట్టి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తాను ఏ స్థాయిలో ఆసక్తిగా వున్నారో.. చెప్పకనే చెప్తున్నారు. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడిగా మారేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో క్రియాశీలకంగా మారేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చేస్తున్నారు.

 

 

సోమవారం ఉదయం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో పార్టీ ఆఫీస్‌తోపాటు ఇంటికి కూడా శంకుస్థాపన చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో అధికార టీడీపీ, బీజేపీలకు సపోర్ట్ చేసి వాళ్ల గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈ మైత్రీబంధాన్ని కొనసాగిస్తూనే పవన్ కళ్యాణ్ సొంతంగా ‘జనసేన’ పేరుతో వేరు కుంపటి పెట్టినా టీడీపీ కనుసన్నల్లో మెలుగుతున్నారని.. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాబుగారే అనే కామెంట్ పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లుకొడుతూనే ఉంది.

 

 

అయితే ఈ సందర్భంలో ఉద్దానం, రాజధాని భూములు విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిగేలా చూసిన విషయాన్ని గమనించాలి. దీన్ని పక్కనపెడితే.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ చివరి వరకూ స్టాండ్ తీసుకోకుండా ప్రభుత్వ నిర్ణయానుసారమే వ్యవహరిస్తున్నారంటూ.. ప్రతిపక్షపార్టీ పబ్లిక్‌గానే పలు ఆరోపణలు చేసింది. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతూ ఆయన ప్యాకేజీ కోసం నాటకాలడుతున్నాడంటూ చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే స్థాయికి పవన్ దిగజారిపోయారని వైసీపీ ఎమ్మెల్యే పలు సందర్భల్లో ఆరోపణలు చేశారు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ‘మీరు తెలుగుదేశం అధిష్టానం కనుసన్నల్లో మెలుగుతున్నారని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. బాబు డైరెక్షన్‌లోనే జనసేనాని పనిచేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానంగా.. ‘ప్రజలకు హాని జరుగుతుంటే తాను పార్టీలను చూడనని.. నేను చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నానని విమర్శించే వాళ్లను (వైసీపీ), మీరు మోడీ డైరెక్షన్‌లో పనిచేయడం లేదా? అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందంటూ ఎదురు ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. మరోవైపు మార్చి 14న గుంటూరులో జరిగే ‘జనసేన’ ఆవిర్భావ దినోత్పవం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ‘జనసేన’. ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో ​ ‘జనసేన’ ఆవిర్భావ దినోత్పవం కీలకంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికి రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేసేందుకు సన్నద్ధమనుతున్నారు.