భీమ్లా నాయక్ (Bheemla Nayak)ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21 సోమవారం గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు తెలంగాణా రాష్ట్ర మినిస్టర్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు కేటిఆర్ ని గెస్ట్ గా పిలవడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. దీనిపై పవన్ యాంటీ ఫ్యాన్స్ కొన్ని వీడియోలు బయటకు తీసి ట్రోల్ చేస్తున్నారు.  

వ్యక్తిగతంగా పవన్(Pawan Kalyan), కేటిఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. అయితే రాజకీయంగా భిన్న ధ్రువాలు. టీఆర్ఎస్ పార్టీకి బద్దశత్రువుగా ఉన్న బీజేపీతో పవన్ దోస్తీ చేస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ కంటే కూడా బీజేపీనే ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది. రెండు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కి షాక్ ఇచ్చి బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కి బీజేపీ తలనొప్పిగా మారింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేలా పావులు కదుపుతున్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలను కూడగడుతున్నారు. 

మరోవైపు పవన్ మోడీని గొప్ప నేతగా అభివర్ణిస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించారు. అయినప్పటికీ ప్రజాప్రయోజన బడ్జెట్ గా పవన్ కొనియాడారు. బీజేపీ మిత్రపక్షం గా ఉన్న జనసేన.. తెలంగాణాలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయదు. కేవలం ఏపీలో సీఎంగా ఉన్న జగన్ ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే బీజీపీతో దోస్తీ అన్నట్లు పవన్ తీరు ఉంటుంది. తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ కి బీజీపీకి మధ్య భీకర పోరు నడుస్తున్నా పవన్ అసలు పట్టించుకోరు. 

జనసేన(Janasena), టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ వ్యవహారాలు ఈ విధంగా ఉన్న నేపథ్యంలో భీమ్లా నాయక్ టీమ్ కేటీఆర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచారు. ఇక సందు దొరికితే ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉండే పవన్ యాంటీ ఫ్యాన్స్ దీనిని ట్రోల్ చేస్తున్నారు. గతంలో కేటిఆర్ (KTR)పవన్ ని విమర్శించిన వీడియో బయటకు తీసి, సెటైర్లు వేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ కేటిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది జనసేన కాదు మోడీ భజన సేన అంటూ సెటైర్లు విసిరారు. ఏదో ఒక పార్టీకి భజన చేసే జనసేన పార్టీకి, అది స్థాపించిన పవన్ కళ్యాణ్ కి అంత బిల్డప్ అవసరమా అంటూ మండిపడ్డారు. పార్టీ స్థాపిస్తే ప్రజాక్షేత్రంలో పోటీ చేయాలి, నీ సంగతేంటో ప్రజలు తేల్చుతారు. అలా కాకుండా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తూ నెట్టుకురావడం ఏమిటంటూ పవన్ పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం సదరు వీడియో వైరల్ అవుతుంది.