`వెంకీమామ` చిత్రంతో వెంకీమామగా మారిపోయిన విక్టరీ వెంకటేష్‌ నేడు 60వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. వెంకీ అరవైలోకి అడుగుపెడుతుండటంతో ఇది బర్త్ డే స్పెషల్‌గా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనేక మంది సినీ సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా పవన్‌, మహేష్‌ వంటి బిగ్‌ స్టార్స్ విషెస్‌ తెలిపారు. 

పవన్‌ స్పందిస్తూ, మంచి మనసున్న సన్మిత్రులు, ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్‌గారితో నాకున్న స్నేహం ఎంతో ప్రత్యేకమైనది. నేను కథానాయకుడిని కాక ముందు నుంచి ఆయనతో నాకు మితృత్వం ఉంది. తరచూ వెంకటేష్‌తో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆయన మంచి చదువరి. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో ఉన్న విషయాలు వివరించేవారు. ఆ సంభాషణలు, చర్చలే మా స్నేహాన్ని ధృడపరచాయి.

 ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సినిమా విషయాలతోపాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి. ఆ స్నేహమే మేమిద్దరం `గోపాల గోపాల` చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ చిత్రం అద్దం పట్టింది. కొత్త తరం దర్శకుల కథలకు, ఆలోచనలకు అనుగుణంగా తనని తాను మలచుకొనే వెంకటేష్‌ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆకాంక్షిస్తున్నాను` అని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వీరిద్దరు కలిసి `గోపాల గోపాల` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో దేవుడంటే నమ్మని వ్యక్తిగా వెంకటేష్‌, కృష్ణుడిగా పవన్‌ నటించారు.

మరోవైపు మహేష్‌బాబు సైతం పెద్దోడు వెంకటేష్‌కి బర్త్ డే విషెస్‌ తెలిపారు. `సూపర్‌ కూల్‌ వెంకీమామకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని, భవిష్యత్‌ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో వెంకీతో దిగిన ఫోటోని పంచుకున్నారు మహేష్‌. వీరిద్దరు కలిసి `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో నటించారు. ఇందులో వెంకీ పెద్దొడుగా, మహేష్‌ చిన్నోడిగా నటించారు.