ఈ ఏడాది మాలయళ పరిశ్రమలో విడుదలైన అయ్యప్పనుమ్ కోషియుమ్ సంచలన విజయం సాధించింది. దర్శకుడు సాచి తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామా అన్ని పరిశ్రమల దృష్టిని ఆకర్షించింది. దీనితో ఈ చిత్రం రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఒరిజినల్ వర్షన్ లో పృథ్వి రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు వర్షన్ లో ప్రధాన పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ని అనుకోవడం జరిగింది. కథలో సమానమైన ప్రాధాన్యత ఉండే మరో హీరో కోసం చాలా పేర్లు వినిపించాయి. 
 
కాగా నేడు అధికారికంగా దీనిపై స్పష్టత ఇచ్చారు. అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీలో పవన్ మరియు రానా నటిస్తున్నట్లు అధికారికరంగా ప్రకటించేశారు. రేపు ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్.. పవన్ మరియు రానా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రేపు ఈ చిత్రం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు చిత్రాలు ప్రకటించిన పవన్ కళ్యాణ్ కి ఇది మరొక చిత్రం. 
 
ఇక అయ్యప్పనుమ్ కోషియుమ్ ఒక మాజీ మిలిటరీ అధికారికి మరియు పోలీసు అధికారికి మధ్య జరిగే ఆధిపత్య పోరు. సొంత ఊరిలోని ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య నడిచే పోరును దర్శకుడు సాచి ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ప్రకటించిన చిత్రాల కంటే ముందే పవన్ ఈ మూవీని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట.