కాపీరైట్ వివాదంలో పవన్ "అజ్ఞాతవాసి".. ఎంటరైన రానా

First Published 2, Jan 2018, 1:21 AM IST
pawan kalyan agnatha vaasi movie in copy right controversy
Highlights
  • పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి
  • తాజాగా కాపీరైట్స్ వివాదంలో అజ్ఞాతవాసి చిత్రం
  • ఫ్రెంచ్ మూవీ కాపీ అంటూ నోటీసులు పంపిన టీ సిరీస్ సంస్థ
  • వివాదం పరిష్కారానికి రానాను రంగంలోకి దింపిన అజ్ఞాతవాసి టీమ్?

సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందిన ఈ మూవీ.. మరో పది రోజుల్లో రిలీజ్ కు సిద్ధంగా వుండగా.. అనుకోని వివాదం అజ్ఞాతవాసిని చుట్టుముట్టినట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

 

అజ్ఞాతవాసి సినిమాకు కాపీరైట్ ఇష్యూ వచ్చిందని, టీ సిరీస్ సంస్థ నుండి దర్శక నిర్మాతలకు నోటీసులు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘లార్గో వించ్' అనే సినిమా స్పూర్తితో ‘అజ్ఞాతవాసి' తెరకెక్కించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ‘టి-సిరీస్' అలర్ట్ అయిందని, ఆ ఫ్రెంచి మూవీ హిందీ రీమేక్ రైట్స్ ఈ సంస్థ దక్కించుకోవడంతో.. ఈ వార్తలు విని  మేల్కొందని అంటున్నారు.

 

‘అజ్ఞాతవాసి' సినిమా ఫ్రెంచి సినిమాకు కాపీ అని ప్రచారం జరుగుతున్నా.. నిర్మాత చినబాబుగానీ, దర్శకుడు త్రివిక్రమ్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు, ఖండించలేదు. దీంతో దర్శకనిర్మాతలకు టీ సిరీస్ సంస్థ నోటీసులు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. తమకు ‘అజ్ఞాతవాసి' సెన్సార్ కాపీ చూపించాలని, ఓసారి చెక్ చేసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

 

ఈ కాపీ రైట్స్ వివాదం నేపథ్యంలో టాలీవుడ్ హీరో రానా రంగంలోకి దిగారు. టి సిరీస్ ఓనర్‌కు రానా చాలా క్లోజ్ కావడంతో... అజ్ఞాతవాసి నిర్మాతలు అతడి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒక వేళ ‘అజ్ఞాతవాసి' సినిమా.. టి-సిరీస్ దక్కించుకున్న ఫ్రెంచి సినిమాకు కాపీ అని తేలితే సినిమా భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య ఏదైనా తేడా వస్తే విషయం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది.

 

అయితే ఈ కాపీ వివాదాన్ని ఇరు వర్గాలు గుట్టు చప్పుడు కాకుండా.. మీడియాకు లీక్ కాకుండా నడిపిస్తున్నారట. విషయం మీడియా వరకు వస్తే డ్యామేజ్ జరిగే ఛాన్స్ వున్నందున అంతా సిక్రెట్ గా నడిపిస్తున్నారట. మరి ఇందులో నిజం ఎంత? అనే విషయంలో ‘అజ్ఞాతవాసి' టీమ్ నుండి ఓ క్లారిటీ వస్తే బావుంటుంది.

 

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. అనిరుధ్ రవించదర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మాత.

loader