పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసి ఆరేళ్ళు దాటిపోతుంది. అయినా ఆ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కాకపోవడం వలనే గత ఎన్నికలలో పవన్ ఘోర పరాజయం చవిచూశారు. పరాజయాల నుండి పాఠాలు నేర్చుకోకుండా పవన్ మళ్ళీ తప్పుటడుగులు వేస్తున్నారు. ఆయన బీజేపీతో పొత్తుపెట్టుకొని సొంత ఐడెంటిటీ కోల్పోయారు. 

మరోప్రక్క పవన్ ని సీఎంగా చూడాలని ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకోసం కష్టపడడానికి మేము సిద్ధం అంటున్నారు. ఐతే పవన్ వరుస సినిమాల ప్రకటనలతో ఈ వర్గం అభిమానులు నిరాశ చెందుతున్నారు. పవన్ ని వెండితెరపై ఎల్లవేళలా చూడాలనుకునే ఫ్యాన్స్ కి కొత్త సినిమాల ప్రకటనలు కిక్ ఇస్తున్నాయి. ఐతే పవన్ రాజకీయంగా ఎదగాలనుకుంటున్న ఫ్యాన్స్ మాత్రం నిట్టూరుస్తున్నారు. 

కొంచెం అటూ ఇటుగా మరో మూడేళ్ళలో ఎన్నికలు రానున్నాయి. మరో ప్రక్క పవన్ ఏకంగా ఐదు సినిమాలు ప్రకటించారు. వీటిలో వకీల్ సాబ్ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. అయినప్పటికీ మరో నాలుగు భారీ చిత్రాలు పవన్ పూర్తి చేయాల్సి వుంది. నాలుగు సినిమాలు పూర్తి కావాలంటే కనీసం మూడేళ్ల సమయం అవసరం. అంతకు మించి కూడా సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ ఎన్నికలకు ఎప్పుడు సన్నధం అవుతారని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పార్టీని నడపడం కోసం సినిమాలు చేస్తున్నానన్న, పవన్ అభిప్రాయాన్ని ఏకీభవించిన ఫ్యాన్స్...మరీ ఐదు సినిమాలు అనే సరికి అయ్యో అంటున్నారు.