దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇస్తున్నపవన్‌కల్యాణ్‌ .. క్రిష్‌, హరీశ్‌ శంకర్‌తోపాటు సాగర్‌ కె.చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారతున్నారు. ఈ నేపధ్యంలో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం కోసం పవన్ ఇచ్చే డేట్స్ చర్చనీయాంశంగా మారాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి పవన్ కేవలం 40 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చారని తెలుస్తోంది. అలాగే ఇందుకు గాను 50 నుంచి 55 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ను తీసుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. 

ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు రానాను చిత్ర టీమ్ ఎంపిక చేసింది. ఈ పాత్ర కోసం ఇప్పటికే సుదీప్‌, విజయ్‌సేతుపతి, రానా పేర్లు విస్తృతంగా వినిపించగా, చివరకు ఆ అవకాశం రానాను వరించింది. మరోవైపు పవన్‌ సినిమాలో భాగమైనందుకు రానా సంతోషం వ్యక్తం చేశారు. ‘మరో ప్రయాణం ప్రారంభమైంది!! ఇప్పటివరకూ అనేక పరిశ్రమలకు చెందిన ఎంతోమంది స్టార్స్‌తో కలిసి పనిచేశాను. కానీ ఇప్పుడు మన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ధన్యవాదాలు’ అని రానా ట్వీట్‌ చేశారు. 

సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌పై, సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ఎస్‌ సంగీతం అందిస్తున్నారు. తమన్‌ బీజీఎం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కిల్లర్‌ కాంబో అంటూ అటు పవన్‌, ఇటు రానా అభిమానులు సోషల్‌ మీడియాలో  సందడి చేస్తున్నారు.