ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ తెలకపల్లి రవి రచించిన 'మన సినిమాలు' పుస్తక ఆవిష్కర కార్యక్రమం నేడు ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరుచూరి గోపాల కృష్ణ, సుద్దాల అశోక్ తేజ, తనికెళ్ళ భరణి లాంటి సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పుస్తకాలపై ఉన్న ఆసక్తితోనే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారని తనికెళ్ళ భరణి అన్నారు. ఆయనకు తాను కూడా ఇదివరకే రెండు పుస్తకాలని బహుకరించినట్లు తనికెళ్ళ భరణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పరుచూరి మాట్లాడుతూ.. ప్రముఖ ఐరిష్ రచయిత జార్జ్ బెర్నాడ్ షా ఒక మాట అన్నారు. సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు.. ఏదో ఒక రోజు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు. రోనాల్డ్ రీగన్, ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, అన్నాదురై.. రేపు పవన్ కళ్యాణ్ అంటూ సినిమాల్లోనుంచి రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన వారి పేర్లని పరుచూరి ప్రస్తావించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పరుచూరి వ్యాఖ్యలకు చిరునవ్వులు నవ్వుతూ కనిపించారు.

"

సినిమావాళ్లు ఒక జీవితాన్ని దశాబ్దాల కాలం పాటు నిర్మించుకుని ఎదుగుతారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లో నటించాలని పరుచూరి పరోక్షంగా కోరారు. ఎంజీఆర్ సినిమాల్లో నటిస్తూనే ముఖ్యమంత్రి అయ్యారని పరుచూరి అన్నారు.