యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం సాహో ఫీవర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో నెలకొని ఉంది. బాహుబలి తర్వాత మరోసారి ప్రభాస్ ఆ స్థాయి చిత్రంలోనే నటించాడు. సాహో ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం గురించి తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తన అభిప్రాయాలని తెలియజేశారు. 

ప్రభాస్ కుర్రవాడిగా ఉన్న సమయంలో కృష్ణం రాజు గారు ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు. ప్రభాస్ నటించిన తొలి చిత్రం ఈశ్వర్. దర్శకుడు జయంత్, రచయితలుగా ఉన్న తమ వద్దకు ప్రభాస్ ని తీసుకువచ్చి మా వాడి సంగతి కొంచెం చూడండి. మంచి హీరో కావాలి అని కృష్ణంరాజు గారు అన్నారు. అలా ఈశ్వర్ చిత్రంతో ప్రభాస్ హీరో అయ్యాడని పరుచూరి తెలిపారు. 

సాహూ చిత్రం గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ లో కృష్ణంరాజు గారు సాహో గురించి సంతోషపడుతూ మాట్లాడారు. ఆయన కళ్ళలో ఆనంద భాష్పాలు కనిపించాయి. కింద కూర్చుని ఉన్న ప్రభాస్ కూడా పెదనాన్నని చూసి కంటతడి పెట్టుకున్నాడు. ట్రైలర్ చూసిన తర్వాత సాహో డిటెక్టీవ్ జోనర్ లో సాగే కథ అని అర్థం అయింది. డిటెక్టివ్ కథని ఇంత భారీ బడ్జెట్ లో తీయడం సాహసమే అని పరుచూరి అన్నారు. సాహో గొప్ప విజయం సాధిచాలని పరుచూరి ఆకాంక్షించారు.