ఆ మధ్య నిఖిల్ నుంచి వచ్చిన 'కార్తికేయ 2' సంచలన విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ కి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు ఆయన తాజా చిత్రమైన 'స్పై' పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మితమవుతోంది. 


 గతేడాది ‘కార్తికేయ 2’ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు నిఖిల్. ఈ హీరో తాజాగా మరో పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే అందుకు ఈసారి స్పై థ్రిల్లర్ కథని ఎంచుకున్నాడు. ‘కార్తికేయ 2’ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా మూవీతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ లో తెరకెక్కుతోన్న ఈ స్పై థ్రిల్లర్ సినిమా ఈ వేసవిలో మీ ముందుకు రానుంది." అంటూ గతంలో నిఖిల్ చెప్పుకొచ్చారు. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇలాంటి సినిమా కోసమే వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్లు పెట్టారు.

 ఈ మూవీకు గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన తొలి సినిమా. ఇంతకు ముందు ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’, ‘పాగల్’, ‘హిట్ 2’ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు గ్యారీ. దీంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ముందునుంచీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ క్రమంలో చిత్రం బిజినెస్ ప్రారంభమైంది. ఈ మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడైనట్లు వెల్లడించారు. అమెజాన్, స్టార్ నెట్‌వర్క్ కలిసి టోటల్ నాన్-థియేట్రికల్ హక్కులను రూ.40 కోట్లకు దక్కించుకోగా నిఖిల్‌ కెరీర్‌లో ఇదే హైయెస్ట్. కాగా నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇంతవరకూ నిఖిల్ చేసిన సినిమాల్లో ఈ స్థాయి మార్కెటింగ్ జరిగిన సినిమా ఇదేనని ట్రేడ్ అంటోంది. 'కార్తికేయ 2'తో నార్త్ లో పెరిగిపోయిన నిఖిల్ క్రేజ్ అందుకు కారణం అని చెప్పాలి.