వివాదాలు, ఆందోళనల మధ్య సంజయ్‌ లీలా భన్సాలీ మూవీ 'పద్మావత్‌' నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అటు కర్ణిసేన ఆందోళనలతో తీవ్ర చిక్కుల్లో కూరుకున్న ఈ మూవీకి, ఓ ఫేస్‌బుక్‌ పేజీ కూడా తీవ్ర షాకిచ్చింది. పద్మావత్‌ ఫుల్‌ మూవీని ఫేస్‌బుక్‌లో లీక్‌ చేసింది. ' జాటోన్‌ కా అడ్డ' అనే ఫేస్‌బుక్‌ పేజీ, థియేటర్‌లో స్క్రీన్‌ అవుతున్న ఈ మూవీని లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. ఇలా లైవ్‌ స్ట్రీమ్‌ అవుతున్న సమయంలోనే ఈ ఫేస్‌బుక్‌ పేజీ లింక్‌ను 15వేల మంది షేర్‌ చేయగా... ఈ వీడియోకు 3.5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇప్పటికే కర్ణిసేన విధ్వంసనలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్న మూవీ యూనిట్‌ సభ్యులకు ఇది మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది.

 

కాగ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గోవా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల ఆపివేశారు. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావత్‌ ప్రదర్శన సాఫీగా సాగుతోంది. దీపికా పదుకోన్‌, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర​ సింగ్‌లు ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులుగా నటించారు. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా చూడ్డానికి బాగుందంటూ మిక్స్‌డ్‌ రివ్యూస్‌ కూడా వచ్చాయి. అయినప్పటికీ కర్ణిసేన ఆందోళనలను మాత్రం తగ్గించడం లేదు.