OTT లపై భరణి షాకింగ్ కామెంట్స్, తనలాంటి వాళ్లకు దారి లేదంటూ..
దర్శకుడిగా నా సినిమా వచ్చి పదేళ్లు అయింది. నా దగ్గర కథలు లేక కాదు. నేనేమో వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేయను. నా తరహా కళాత్మక సినిమాలు చేసే నిర్మాతలే కనిపించడం లేదు.
తనికెళ్ళ భరణి (Tanikella Bharani)లో గొప్ప నటుడు ఉన్నారని మనందరికీ తెలుసు. జనరేషన్స్ మారుతున్నా ఆయనలో నటుడు మాత్రం ఎక్కడా వెనకబడలేదు. ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే ఆయనలో ఓ రచయిత కూడా ఉన్నారు. 'లేడీస్ టైలర్', 'మహర్షి', 'శివ', 'నారీ నారీ నడుమ మురారి', 'మనీ మనీ' తదితర చిత్రాలకు ఆయన రైటర్. ఆయన దర్శకుడుగా కూడా సినిమాలు చేసారు. 'మిథునం' సినిమా (Mithunam Movie) చూసిన చాలా మంది ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆయనలో అంత గొప్ప దర్శకుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోయారు. అయితే ఆ సినిమా వచ్చి పదేళ్లు దాటినా మరో సినిమా చెయ్యలేదు. ఎందుకిలా జరిగింది అంటే...ఆయన ఓటిటిలవైపు వేలు చూపించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘పెదకాపు’ త్వరలో విడుదల కానుంది. ఆ సినిమాలో కీ రోల్ పోషించిన నేపథ్యంలో మీడియాను కలిసిన భరణి.. ఓటీటీల తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ...‘‘‘‘40 ఏళ్ల సినీ ప్రయాణంలో నేను చేయాలనుకున్న ‘మిథునం’ సినిమా చేశా. ఇంకొక సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీయాలనే ఓ ఆలోచన ఉంది. దర్శకుడిగా నా సినిమా వచ్చి పదేళ్లు అయింది. నా దగ్గర కథలు లేక కాదు. నేనేమో వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేయను. నా తరహా కళాత్మక సినిమాలు చేసే నిర్మాతలే కనిపించడం లేదు. ఓటీటీ వేదికలు నాలాంటివాళ్లకి తలుపులు మూసేశాయి .
ఆర్ట్‌లో కూడా హింస, అసభ్యత కనిపించాల్సిందే అంటున్నారు. వాళ్లకు కావాల్సిన కంటెంటే ఇవ్వాలంటున్నారు. నేనేమో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా రాయకుండా తప్పించుకుని వచ్చిన వాడిని. ఆర్ట్ సినిమాలు తీసే పరిస్థితులు ఇంక ఎప్పటికీ రావా అనే ప్రశ్న వస్తుందేమో. ప్రస్తుతం అలాగే ఉంది పరిస్థితి.
కానీ ఎప్పటికీ ఇలాగే ఉండదు. కొరివి కారం, పచ్చళ్లు అన్నీ తిన్నాక అనారోగ్యానికి గురై డాక్టర్ దగ్గరికి వెళ్తే బీరకాయ, పాలు అంటూ పత్యం చెబుతాడు. అలా పత్యం సినిమాలు కూడా వస్తాయి. రేపన్న రోజు ఒక సాత్వికమైన సినిమా అద్భుతంగా ఆడితే.. అందరూ అలాంటి సినిమాలపై దృష్టిపెడతారు. అలాంటి సినిమాల కోసం ఎదురు చూడాలి అంతే’’ అని భరణి అన్నారు.
ఇక ప్రస్తుతం తనికెళ్ళ భరణి నటుడిగా బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'రంగమార్తాండ' సినిమాలో ప్రకాష్ రాజ్ సన్మాన సన్నివేశంలో ఆయన కనిపించారు. ధనుష్ 'సార్' సినిమాలోనూ నటించారు. 'ధమాకా'లో మాస్ మహారాజా రవితేజ తండ్రి పాత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార', సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట', విక్టరీ వెంకటేష్ & మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 3' తదితర హిట్ సినిమాల్లో ఆయన ఉన్నారు. మరిన్ని పెద్ద సినిమాల్లోనూ ఆయన కనిపించబోతున్నారు.