ఓటీటీ జైంట్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ నిర్ణయంతో టాలీవుడ్ వర్గాల్లో గుబులు మొదలైంది. నిర్మాతలకు వారి నిర్ణయం ప్రాణసంకటం కానుంది. దీనిపై తీవ్ర చర్చ మొదలైంది.  

దశాబ్దాలుగా సినిమా అనేక మార్పులకు గురైంది. కళకు మించి కమర్షియల్ కోణం తీసుకున్నాక ముఖ చిత్రం మారిపోయింది. ఒకప్పుడు నిర్మాతకు ప్రతి రూపాయి థియేటర్స్ నుండి మాత్రమే వచ్చేది. తర్వాత మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంటూ అదనపు ఆదాయం వచ్చి చేరింది. అది నిర్మాతలకు వేడి నీళ్లకు చన్నీళ్ల వలె తోడ్పడుతుంది. ఓటీటీ ఎంట్రీతో డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలు భారీగా లబ్దిపొందుతున్నారు. సినిమాకు ఉండే హైప్ ని బట్టి విడుదలకు ముందే ఫ్యాన్సీ ధరలు చెల్లించి ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ దక్కించుకుంటున్నాయి. 

అంతర్జాతీయ, జాతీయ సంస్థలు మధ్య నెలకొన్న పోటీ కూడా నిర్మాతలకు కలిసొస్తుంది. కొన్ని సినిమాలు ఓటీటీ రైట్స్ తో పెట్టుబడి లాగేస్తున్నాయి. కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఈ క్రమంలో నిఖిల్ నెక్స్ట్ మూవీ 18 పేజెస్ పై హైప్ ఏర్పడింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ తో నిర్మాత బ్రేక్ ఈవెన్ అయిపోయాడు. థియేటర్స్ లో వచ్చిన ప్రతి రూపాయి లాభమే అని ప్రకటించారు. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ నిర్మాతలకు నష్టం కంటే కూడా లాభమే చేస్తున్నాయి. 

అయితే ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి దిగ్గజ ఓటీటీ సంస్థల తాజా నిర్ణయం నిర్మాతలను కలవరపెడుతుంది. తెలుగు సినిమాలను తక్కువగా కొనాలని వారు నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల కొన్ని భారీ చిత్రాల వలన కలిగిన నష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది. తెలుగు సినిమాలను దాదాపు ప్రైమ్, నెట్ఫ్లిక్స్ దక్కించుకుంటాయి. కేవలం ఈ రెండు సంస్థలు టాలీవుడ్ కంటెంట్ పై ఏడాదికి రూ. 250-300 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. వారు సినిమాలు కొనడం మానేస్తే డిమాండ్ పడిపోతుంది. నిర్మాతల ఆదాయానికి గండి పడుతుంది. 

ఏడాదికి 50 సినిమాల వరకు ప్రైమ్, నెట్ఫ్లిక్స్ నిర్ణయంతో నష్టపోయే సూచనలు ఉన్నాయి. దీనికి నిర్మాతల చర్యలే కారణం అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మోజులో భారీ బడ్జెట్ చిత్రాలంటూ గ్రౌండ్ రియాలిటీకి దూరంగా చిత్రాలు చేస్తున్నారు. హైప్డ్ చిత్రాలను ఫ్యాన్సీ ధరలు చెల్లించి నష్టపోయిన ఓటీటీ సంస్థలు టాలీవుడ్ కంటెంట్ కొనకూడదనే నిర్ణయం తీసుకుందని అంటున్నారు. 

ఆ మధ్య ఓ చిత్రాన్ని రూ. 30 కోట్లకు ఓటీటీ సంస్థ కొనుగోలు చేస్తే రూ. 6 కోట్లు కూడా రికవరీ కాలేదని చిత్ర వర్గాల వాదన. రూ. 30-40 కోట్లు పెట్టి భారీ చిత్రాలు కొనే కంటే నాలుగైదు మీడియం బడ్జెట్ చిత్రాలు కొనుగోలు చేస్తే బెటర్ అని బావిస్తున్నారట. అలాగే భిన్నమైన కాన్సెప్ట్స్ తో తెరకెక్కుతున్న మలయాళ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారట. ప్రైమ్, నెట్ఫ్లిక్స్ తెలుగు సినిమాను పక్కన పెడితే... మిగతా సంస్థలు తక్కువ ధరలకు అడుగుతాయి. ఈ రెండు కాదంటే హాట్ స్టార్ మాత్రమే దిక్కవుతుంది. మొత్తంగా దిగ్గజ ఓటీటీ సంస్థల నిర్ణయంతో టాలీవుడ్ నిర్మాతలకు నిద్రపట్టడం లేదట...