తెలుగు బిగ్ బాస్ సీజన్ 3పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వివాదాల కారణంగా ఈ షో ఆగిపోతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ 'స్టార్ మా' సంస్థ మాత్రం బిగ్ బాస్ 3 ప్రారంభం కావడానికి ఇక మూడు రోజులే మిగిలివుందంటూ ప్రోమోలు పెడుతోంది. 

బిగ్ బాస్ 3 షో కోసం సభ్యులని ఎంపిక చేసే ప్రక్రియలో లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఇప్పటికే యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో మన సాంప్రదాయాలకు విరుద్ధం అని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదాలన్నింటి నేపథ్యంలో బిగ్ బాస్ 3 ప్రసారం సాఫీగా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సీజన్ 3కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉస్మానియా జేఏసీ మీడియా సమావేశం నిర్వహించి బిగ్ బాస్ శని అడ్డుకుంటామని ప్రకటించారు. తెలంగాణ సాంప్రదాయాలకు విరుద్ధమైన ఈ షోని ప్రసారం చేయడానికి వీలు లేదని డిమాండ్ చేస్తున్నారు.