ఆస్కార్ (Oscars 2022) వేదికపై సంచలనం చోటు చేసుకుంది. అమెరికన్ నటుడు క్రిస్ రాక్ ని చెంప చెళ్ళుమనింపించాడు హీరో విల్ స్మిత్. తన భార్య గురించి మాట్లాడొద్దంటూ విల్ స్మిత్ క్రిస్ రాక్ పై చేయి చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు .  

లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత సినీ అవార్డుల ఆస్కార్ వేదిక సాక్షిగా సంచలనం నమోదైంది. హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అమెరికన్ నటుడు క్రిస్ రాక్ పై చేయి చేసుకున్నారు. 94వ అకాడమీ అవార్డ్స్ ప్రెజెంటర్స్ లో ఒకరైన క్రిస్ రాక్ (Chris Rock)అవార్డ్ ప్రకటిస్తూ విల్ స్మిత్ వైఫ్ జడా పెంకెట్ స్మిత్ పై కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు. దీంతో కోపానికి గురైన విల్ స్మిత్ వేదికపై అందరూ చూస్తుండగానే క్రిష్ రాక్ ని తిట్టారు. నీ దరిద్రపు నోటి నుండి నా భార్య పేరు రానీయకు అంటూ... క్రిస్ రాక్ ముఖంపై పంచ్ విసిరాడు. 

ఈ హఠాత్పరిణామానికి ఆస్కార్ వేడుకకు హాజరైన ప్రపంచ ప్రఖ్యాత నటులు, దర్శక నిర్మాతలు షాక్ తిన్నారు. ఈ వేడుకను లైవ్ లో ప్రసారం చేస్తున్న డిస్నీ హాట్ స్టార్ కొంత సమయం పాటు స్ట్రీమింగ్ ఆపివేసింది. సినిమా వేడుకల్లో సెన్సేషన్ కోసం, ఆడియన్స్ కి కొంచెం థ్రిల్ పంచడానికి ఇలాంటి అసాధారణ పరిణామాలు స్క్రిప్ట్ ప్రకారం అమలు చేస్తారు. కాబట్టి విల్ స్మిత్ (Will Smith)తోటి నటుడిని ఆస్కార్ వేదికపై కొట్టడం స్క్రిప్టెడా లేక నిజంగానే కొట్టాడా ? అనే అయోమయంలో ప్రముఖులు ఉండిపోయారు. అమెరికన్ నటి అయిన జడా పెంకెట్ ని విల్ స్మిత్ 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కలరు. 

Scroll to load tweet…

క్రిస్ రాక్ స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగాడు. కమెడియన్ గా హాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ రాక్ రచయిత కూడాను. నిర్మాతగా, దర్శకుడిగా పలు రంగాలలో రాణిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కెరీర్ కలిగిన క్రిస్ రాక్ ని విల్ స్మిత్ వేదికపై కొట్టడం దారుణమని చెప్పాలి. కాగా 94 అకాడమీ అవార్స్డ్ లో ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ ఎంపికయ్యారు. కింగ్ రిచర్డ్ చిత్రంలోని నటనకు గాను ఆయనను ఆస్కార్ వరించింది.