ఆస్కార్ అవార్డులో తొలి నిరాశ ఎదురయ్యింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయిన `ఆల్ దట్ బ్రీత్స్` చిత్రానికి అవార్డు దక్కలేదు.
ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం ఆస్కార్ వేడుక గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం(సోమవారం మార్నింగ్-ఇండియా టైమ్) లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరుగుతుంది. ఇందులో మన ఇండియన్( మన తెలుగు) తారలు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్‌చరణ్‌తోపాటు ఆయన భార్య ఉపాసన కూడా ఆస్కార్ వేడుకలో సందడి చేయడం విశేషం.
మన తెలుగు సినిమా `ఆర్‌ఆర్‌ఆర్` ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. `నాటు నాటు` పాటకిగానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. దీంతోపాటు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో `ది ఎలిఫెంట్ విస్పరర్స్`, అలాగే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో `ఆల్ దట్ బ్రీత్స్` చిత్రాలు ఆస్కార్ నామినేషన్లని సాధించాయి.
ఇదిలా ఉంటే ఆస్కార్‌లో మన ఇండియాకి ఈ ఏడాది మొదటి నిరాశ ఎదురయ్యింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ లో నామినేట్ అయిన ఆల్ దట్ బ్రీత్స్` కి అవార్డు దక్కలేదు. ఆ స్థానంలో అమెరికాకి చెందిన `నావల్నీ` డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కి అవార్డు దక్కింది. ఈ చిత్రానికి డానియల్ రోహెర్ దర్శకత్వం వహించగా, ఇది రష్యా అపోజిషన్ లీడర్ అలెక్సీ నావల్నీ చుట్టూ తిరుగుతుంది. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయిన `ఆల్ దట్ బ్రీత్స్` చిత్రానికి షానక్ సేన్ దర్శకత్వం వహించారు. ఇద్దరు అన్నదమ్ముల కథని తెలియజేసే చిత్రమిది.
