ఇండియాలో ఈ శుక్రవారం పెద్ద సినిమాలు లేకపోవడంతో అంతా హలీవుడ్ మూవీస్ `ఓపెన్ హైమర్`, `బర్బీ` చిత్రాలపై పడింది. మరి ఈ మూవీస్‌కి ఎలాంటి ఆదరణ ఉందనేది చూస్తే..
హాలీవుడ్ సినిమాల ప్రభావం ఇండియాపై చాలా ఉంటుంది. హాలీవుడ్ చిత్రాలకు ఇండియా కూడా ఓ పెద్ద మార్కెట్‌గానే చెప్పొచ్చు. ఇక్కడ ఆయా సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తుంటాయి. `అవతార్`, `అవెంజర్`, `ది జురాసిక్ పార్క్` వంటి సినిమాలు ఇక్కడ కూడా భారీగా వసూలు చేస్తుంటాయి. దీంతో ఆయా చిత్రాలకు అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం రెండు భారీ హాలీవుడ్ సినిమాలు ఇండియాలో విడుదలయ్యాయి. రెండు ప్రతిష్టాత్మకమైన మూవీ కావడంతో అందరి చూపు వీటిపైనే పడింది. ఇండియాలో ఈ శుక్రవారం పెద్ద సినిమాలు లేకపోవడంతో అంతా వీటి వైపు చూశారు. ఈ శుక్రవారం `ఓపెన్ హైమర్`, `బర్బీ` చిత్రాలు విడుదలయ్యాయి.
సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఓ అంచనాలుంటాయి. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులుంటారు. ఇక్కడ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్‌తో ఆయన్నుంచి వచ్చిన చిత్రమే `ఓపెన్ హైమర్`. ఇది అమెరికా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా, `మ్యాన్ హట్టన్` మిషన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన్ని ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్ అని కూడా అంటారు. హిస్టరీ అతి ముఖ్యమైన సంఘటన నేపథ్యంగా, దానికి అప్పటి పాలిటిక్స్ కి ముడివేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇండియాలో సత్తా చాటింది.
టాక్ పరంగా మిశ్రమ స్పందన లభించింది. కానీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఇండియాలో సుమారు 14కోట్లు వసూలు చేసింది. ఇక్కడ తన పోటీ దారి సినిమా అయిన `బార్బీ`కి మూడు రెట్లు అధికంగా వసూలు చేయడం విశేషం. ఇందులో రాబర్ట్ హెమర్‌గా సిలియన్ ముర్ఫీ నటించారు. ఆయన నటన ఆకట్టుకుంటుంది. చర్చల ప్రధానంగా సినిమా సాగింది. యాక్షన్ కి ప్రయారిటీ ఇస్తే బాగుండేదనే కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 29 మిలియన్ డాలర్లు మాత్రమే చేసింది. `బార్బీ`లో సగం కూడా చేయలేకపోయింది.
అదే రోజు మరో సినిమా `బార్బీ` ఇండియాలో విడుదలైంది. దీని హవా ప్రపంచ వ్యాప్తంగా మామూలుగా లేదు. 66 మిలియన్ డాలర్ల కి పైగా కలెక్షన్లని రాబట్టిందీ మూవీ. కానీ ఇండియాలో మాత్రం చతికిలపడింది. ఈ సినిమాకి కేవలం ఐదు కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. అయితే దీనికి ఇండియాలో క్రేజ్ లేకపోవడం గమనార్హం. మార్గోట్ రాబీ బార్బీగా నటించగా, ఆమెకి జోడీగా ర్యాన్ గోస్‌లింగ్ నటించారు. ఇది కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. బార్బీలాండ్‌లో ఈ జంట చేసే సందడి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. వార్నర్ బ్రోస్.. పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. మొత్తంగా ఇండియాలో క్రిస్టోఫర్ నోలన్ `ఓపెన్ హైమర్` హవా సాగుతుందని చెప్పొచ్చు.
