మంచు విష్ణు, ఇలియానా జంటగా.. మోహన్ బాబు కీలక పాత్రలో 2009లో 'సలీం' సినిమా రూపొందింది. వైవిఎస్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు వహించగా.. మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. 2009 డిసంబర్ 11న ఈ సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు గాను రెమ్యునరేషన్ గా వైవిఎస్ కి అందాల్సిన మొత్తం రాకపోవడంతో అతడు అప్పట్లో డైరెక్టర్స్ అసోసియేషన్ ని సంప్రదించారు.

నిజానికి వైవిఎస్ కి నలభై ఐదు లక్షల యాభై వేల రూపాయలకు మోహన్ బాబు చెక్ రాసిచ్చారు. అయితే సినిమా రిలీజ్ అయిన తరువాతే డబ్బు తీసుకోవాలని చెప్పడంతో వైవిఎస్ సినిమా రిలీజ్ అయిన తరువాత బ్యాంక్ ని సంప్రదించాడు. అక్కడి అధికారులు ఈ చెక్ నెంబర్ ని బ్లాక్ చేసినట్లు అమౌంట్ ఇవ్వడానికి కుదరదని చెప్పడంతో వైవిఎస్ దర్శకుల సంఘాన్ని ఆశ్రయించాడు.

'సలీం' సినిమా ఘోర పరాజయం కావడంతో వైవిఎస్ కి, మోహన్ బాబుకి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్లింది. రూ.10 కోట్ల రెమ్యునరేషన్ లో సినిమా తీస్తానని చెప్పి వైవిఎస్ రూ.25 కోట్ల బడ్జెట్ చేశాడని అప్పట్లో మోహన్ బాబు ఆరోపించారు. పరోక్షంగా పదిహేను కోట్లు వైవిఎస్ తన జేబులో వేసుకున్నాడని అన్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు వైవిఎస్ కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఆపేశాడు. 

దీనిపై మోహన్ బాబుకి వైవిఎస్ లెటర్ కూడా రాశాడు. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ చెల్లించమని కోరారు. కానీ దాన్ని మోహన్ బాబు పట్టించుకోలేదు. దీంతో అతడు దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేస్తే వారు దాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి పాస్ చేశారు. అక్కడ సరైన న్యాయం జరగపోవడంతో వైవిఎస్ కోర్టుని ఆశ్రయించగా.. న్యాయస్థానం మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్షను విధిస్తూ ఈరోజు తీర్పుని వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానా కూడా విధించింది.