స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో మూవీపై అద్భుతమైన బజ్ నెలకొని ఉంది. బన్నీ, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న చిత్రం ఇది. దీనితో పాటు చిత్ర యూనిట్ పక్కా ప్రణాళిక ప్రకారం ప్రమోషన్స్ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

ప్రస్తుతం తమన్ కెరీర్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. రాములో రాములా, సామజవరగమనా సాంగ్స్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా చిత్ర యూనిట్ మరో సాంగ్ ని రిలీజ్ చేసింది. 

ఓటీవలె ఓ మైగాడ్ డాడీ అంటూ సాగే ప్రోమోని రిలీజ్ చేశారు. తాజాగా పూర్తి పాటని విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణ చైతన్య అద్భుతమైన సాహిత్యం అందించాడు. తమన్ సంగీతం ఆకట్టుకుంటోంది. తన తండ్రిపై అల్లు అర్జున్ కోపాన్ని ప్రదర్శించే నేపథ్యంలో ఈ సాంగ్ ఉండబోతోంది. 

'అమ్మకి మొగుడు నాన్నయ్యాడు.. మమ్మీ మొగుడు డమ్మీగాడు' అంటూ తండ్రిపై ఉన్న కోపాన్ని మొత్తం ప్రదర్శిస్తున్నాడు. 'ఈ ఇంట్లో నవ్వాలంటే థానోస్ చిటికెయ్యాలంతే' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రెండీ మ్యూజిక్ తో ఆకట్టుకుంటున్న ఈ పాట కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడం ఖాయం. 

ఈ పాటని రోల్ రైడ, రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ నంబియార్ పాడారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే రొమాన్స్ చేస్తోంది. హీరో సుశాంత్, టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ తండ్రిగా మురళి శర్మ నటిస్తుండడం విశేషం.