బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా పాల్గొన్న నూతన్ నాయుడు ఇప్పుడు నటుడిగా కెరీర్ మారాడు. ఆ షోతో సంపాదించుకున్న పాపులారిటీ సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేస్తోంది. ఇటీవల 'ఎఫ్ 2' సినిమాలో వెన్నెల కిషోర్ పక్కన స్నేహితుడిగా కనిపించి సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ పండించాడు నూతన్.

ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. సందీప్ కిషన్ హీరోగా దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి 'తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్' అనే సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో నాగేశ్వరరెడ్డికి ప్రత్యేకమైన శైలి ఉంది. ఈ సినిమాను కూడా కామెడీ యాంగిల్ లోనే చిత్రీకరిస్తున్నాడు. కథ వరకు ఈ సినిమా 'చెట్టుకింద ప్లీడర్' సినిమాను పోలి ఉంటుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో హీరో క్లైంట్ గా కనిపిస్తూ అతడిని చిక్కుల్లో పడేసే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అతడి పాత్ర క్లిక్ అయితే గనుక టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఖాయం.