యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్30’ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ కు యూనిట్ సిద్ధమవుతోంది. దీనిపై తాజాగా అప్డేట్ అందింది. 

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత తారక్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన తదుపరి చిత్రాలైన ‘ఎన్టీఆర్ 30’, ‘ఎన్టీఆర్ 31’పైనా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు చిత్రాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఎన్టీఆర్31 షూటింగ్ కాస్తా ఆలస్యం కానుండటంతో ఇప్పట్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఎన్టీఆర్ మరియు కొరటాల శివ (Koratala Siva) ‘ఎన్టీఆర్30’ కోసం షూటింగ్ సిద్ధమవుతున్నారు. తాజాగా సమాచారం ప్రకారం.. ఆగస్టు నెలలో రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. కేవలం ఆరు లేదా ఏడు నెలల్లో సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ లెక్కన ఎన్టీఆర్30 వచ్చేఏడాది వేసవి కల్లా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఇంకా స్క్రిప్ట్ వర్క్ ను కంప్లీట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ 30 అనేది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండనుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కున్నట్టు తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ రెండు షేడ్స్‌లో కనిపించనున్నాడంట. ఇందులో ఒకరు ఫారెస్ట్ మాఫియాను అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. సుధాకర్ మిక్కిలినేని మరియు నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 

ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా అలియా భట్ తో పాటు పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించినా సెట్ కావడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. త్వరలో హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేయనున్నారు. ఆ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.